కోల్‌సిటీ: గోదావరిఖని జీఎంకాలనీకి చెందిన ఇరుగురాళ్ల శ్రీనివాస్ (50) అనే ఎల్‌ఐసీ ఏజెంట్ మంగళవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. ఇంట్లో అస్వస్థతకు గురైన శ్రీనివాస్‌ను జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుకి సన్‌స్ట్రోక్ లక్షణాలే అయి ఉంటాయని కుటుంబ సభ్యులు, ఏజెంట్లు తెలిపారు. అంత్యక్రియల కోసం వారి స్వగ్రామమైన ధూళికట్ట గ్రామానికి తరలించారు. కాగా, శ్రీనివాస్ పార్థివదేహానికి ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు జనగామ సదయ్య, ప్రధాన కార్యదర్శి కటకం సతీశ్, కోశాధికారి అంబాల బాబు, జోనల్ నాయకులు బుర్ర దామోదర్‌తోపాటు ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు, ఏజెంట్లు నివాళి అర్పించారు.
మహిళ ఆత్మహత్య
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన యాదగిరి భాగ్యలక్ష్మి(45) కడుపునొప్పి బాధ భరించలేక మంగళవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. మృతురాలి భర్త కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి–ఓదెల గ్రామాల మధ్య ఎస్సారెస్పీ డీ–86కాలువలో గోదావరిఖనికి చెందిన బండారి రామరాజు(58) పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం కాలువలో రామరాజు మృతదేహం కొట్టుకురాగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. గోదావరిఖనికి చెందిన రామరాజు ఎలిగేడు మండలం శివపల్లికి తన స్నేహితుడి వద్దకు వచ్చినట్లు సమాచారం. అయితే, ప్రమాదవశాత్తు జారిపడ్డడా, లేదా ఇతరత్రా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


