వైద్యసేవల్లో ‘పెద్ద’పల్లి భేష్‌ | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవల్లో ‘పెద్ద’పల్లి భేష్‌

Apr 8 2026 7:02 AM | Updated on Apr 8 2026 7:02 AM

● జిల్లా ఆస్పత్రికి అవార్డుల పంట ● నాలుగు రాష్ట్రస్థాయి పురస్కారాలు

పెద్దపల్లి: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి అవార్డుల పంట పండింది. రాష్ట్రంలోనే అత్యధిక పురస్కారాలు సాధించిన ఘనత దక్కింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నుంచి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ పురస్కారాలు అందుకున్నారు. వైద్య, సేవల్లో నాణ్యత, ప్రజారోగ్య పథకాల అమలులో సాధించిన విజయానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పెంచడం, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంలో పెద్దపల్లి జిల్లా ఆ స్పత్రి సాధించిన విజయం ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రతిష్టాత్మక అవార్డులు

జిల్లా ఆస్పత్రి కీలక అవార్డులు సొంతం చేసుకుంది. సూపరింటెండెంట్‌ కేటగిరీలో శ్రీధర్‌కు బెస్ట్‌ సూపరింటెండెంట్‌ పురస్కారం లభించింది. అనెస్థీషియా, సివిల్‌ సర్జన్‌గా ఆయన అందిస్తున్న అత్యుత్తమ వైద్యసేవలకు ఈ గుర్తింపు దక్కింది. ఆరోగ్యశ్రీ ద్వారా అత్యధిక కేసులు విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఆస్పత్రికి రాష్ట్రంలోనే ప్రథమ బహుమతి లభించింది. టీ – హబ్‌ ద్వారా అత్యధిక రక్తపరీక్షలు నిర్వహించినందుకు మరోప్రత్యేక అవార్డు అందుకుంది.

రేడియాలజీ విభాగానికి గుర్తింపు

కేవలం ఆస్పత్రి స్థాయిలోనే కాకుండా, విభాగాల వారీగా కూడా జిల్లా ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు లభించింది. రేడియాలజీ విభాగంలో అత్యధిక స్కానింగ్‌లు నిర్వహించినందుకు డాక్టర్‌ సంధ్యారాణిని ప్రత్యేక అవార్డుతో సత్కరించారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ, ఇది తన వ్యక్తిగత విజయం కాదన్నారు. వైద్యసిబ్బంది సమష్టి కృషి ఫలితం అని పేర్కొన్నారు. పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement