జీజీహెచ్‌లో ‘క్రిటికల్‌ కేర్‌’ సేవలు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ‘క్రిటికల్‌ కేర్‌’ సేవలు

Apr 8 2026 7:02 AM | Updated on Apr 8 2026 7:02 AM

రూ.23.75 కోట్లతో భవన నిర్మాణం రెండంతస్తులు.. 50 పడకల సామర్థ్యం నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

కోల్‌సిటీ(రామగుండం): అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జిల్లావాసులకు ఊపిరి పోసేందుకు గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. జీజీహెచ్‌ ఆవరణలోనే సుమారు రూ.23.75 కోట్ల వ్యయంతో 50 పడకల సామర్థ్యంతో రెండు అంతస్తుల్లో భవనం నిర్మించారు. పెద్దపల్లికేకాకుండా పొరుగున ఉన్న మంచిర్యాల, కరీంనగర్‌, భూపాలపల్లి తదితర జిల్లాల ప్రజలకు కూడా అత్యవసర వైద్యసేవలు మరింత వేగంగా అందనున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ బుధవారం క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.

రూ.23.75 కోట్ల వ్యయం

క్రిటికల్‌ కేర్‌ కోసం జీ ప్లస్‌– 2 పద్ధతిన ఆధునిక భవనం నిర్మించారు. భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.13.75 కోట్లు వెచ్చించారు. 2024 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ భూమిపూజ చేశారు.

ఆధునిక సదుపాయాలు.. 50 పడకలు

క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ 50 పడకల సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతీబెడ్‌ వద్ద ఆధునిక మానిటరింగ్‌ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ లైన్లు, సెంట్రలైజ్డ్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌, సర్జికల్‌ సపోర్ట్‌ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. పేషెంట్లకు 24 గంటలపాటు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించనున్నారు. క్రిటికల్‌ కేర్‌ విభాగంలో 60 రకాల అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చాలని కోరుతూ ఆరు నెలల క్రితమే డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)కి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ దయాళ్‌సింగ్‌ ప్రత్యేకంగా లేఖ రాశారు.

కలెక్టర్‌ పర్యవేక్షణలో భవన నిర్మాణం

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రత్యేక పర్యవేక్షణలో క్రిటికల్‌ కేర్‌ విభాగం పనులు వేగంగా పూర్తయ్యాయి. నిర్మాణంలో ఆలస్యం జరగకుండా తరచుగా సమీక్షించారు. ఇంజినీర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ పనుల్లో వేగం పెంచేలా చొరవ తీసుకున్నారు.

ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌

ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌ అందించేందుకు అవసరమైన పరికరాలు, ప్రత్యేక విభాగాలు ఈ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఏర్పాట్లు చేస్తున్నాం

క్రిటికల్‌ కేర్‌ను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు బుధవారం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేపట్టాం. ఇప్పటికే అత్యాధునిక వైద్యపరికరాలు తెప్పించాం. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. – అరుణ,

డిప్యూటీ సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement