పట్నా: బిహార్ మంత్రి మండలిలో ఏ పార్టీకి అధిక ప్రాధాన్యం, ఎవరెవరికి అవకాశం దక్కనుందనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 73 స్థానాలు గెలుపొందిన బీజేపీకి మంత్రి మండలిలో అధిక ప్రాధాన్యం ఉండనుంది. బీజేపీ నేతలు తారా కిశోర్ ప్రసాద్, రేణు దేవికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీ లెజిస్లేటివ్ నేతగా తారా కిశోర్ ప్రసాద్, ఉప నేతగా రేణు దేవి ఎన్నికవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ నేత నంద కిశోర్ స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు. జేడీయూ నుంచి విజయ్ చౌదరి మరోమారు మంత్రి పదవి చేపట్టనున్నారు.
హెచ్‌ఏఎం పార్టీ నుంచి సంతోష్ సుమన్, వీఐపీ పార్టీ నుంచి ముఖేశ్ సాహ్ని మంత్రులుగా ప్రమాణం చేస్తారని సమాచారం. జేడీయూ నేత విజేంద్ర యాదవ్, జేడీయూ బిహార్ ప్రెసిడెంట్ అశోక్ చౌదరి, తారాపూర్ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి, ఫూల్‌పూర్ ఎమ్మెల్యే షీలా కుమారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు తెలిసింది. ఇక ప్రస్తుత నితీశ్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం సుశీల్ మోదీకి ఈసారి మొండిచేయి ఎదురవనుంది. అయితే, ఆయనకు కేంద్రంలో పదవీ బాధ్యతలు ఇస్తారని తెలిసింది. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి 125 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ పార్టీల మహాగఠ్ బంధన్ 110 స్థానాలు మాత్రమే సాధించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోమంత్రి అమిత్ షా నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment