బిహార్‌ ఫలితాలు-ఆసక్తికర అంశాలు | Bihar Polls Reveals Caste And Gender Religious | Sakshi
Sakshi News home page

బిహార్‌ ఫలితాలు-ఆసక్తికర అంశాలు

Published Wed, Nov 18 2020 1:53 PM | Last Updated on Wed, Nov 18 2020 3:04 PM

Bihar Polls Reveals Caste And Gender Religious - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి సామాజిక నేపథ్యం ఏమిటీ? వారు సమాజంలో ఏ వర్గానికి చెందిన వారు? తెలుసుకునేందుకు విజేతల కుల, మతాలు, ఆడ, మగ అంశాలపై ‘త్రివేది సెంటర్‌ ఆఫ్‌ పొలిటికల్‌ డాటా’ పరిశోధకులు వివరాలు సేకరించి ‘అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌’ వద్ద నున్న డాటాతో విశ్లేషించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్‌ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 40.7 శాతం మంది ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ)కు చెందిన వారు కాగా, అగ్రవర్ణాలకు చెందిన వారు 30 శాతం మంది, షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారు 16. 5 శాతం మంది ఉన్నారు. 

ముస్లిం మతానికి చెందిన వారు 8 శాతం మంది ఉన్నారు. అగ్రవర్ణాల వారికన్నా ఇతర వెనక బడిన వర్గాల వారే ఎక్కువ మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక పార్టీల పరంగా చూస్తే అగ్రవర్ణాలకు చెందిన వారు బీజేపీ తరఫున 34 మంది, రాష్ట్రీయ జనతాదళ్‌ తరఫున 13 మంది జేడీయూ తరఫున పది మంది, కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఏడుగురు విజయం సాధించారు. వెనకబడిన వర్గాలకు చెందిన వారు రాష్ట్రీయ జనతాదళ్‌ తరఫున 39 మంది, బీజేపీ తరఫున 27 మంది, జేడీయూ తరఫున 22 గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున ఇద్దరంటే ఇద్దరే విజయం సాధించారు. 
(చదవండి: కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్‌)

ఇక టిక్కెట్ల కేటాయింపు విషయానికొస్తే మొత్తం 110 అభ్యర్థుల్లో అగ్రవర్ణాలకు 52 టిక్కెట్లు, ఇతర వెనకబడిన వర్గాలకు 39, షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారికి 15 టిక్కెట్లు, షెడ్యూల్డ్, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారికి ఒక టిక్కెట్‌ కేటాయించింది. ముస్లిం వర్గానికి ఒక్క టిక్కెట్‌ కూడా ఇవ్వలేదు. బీజేపీకి చెందిన మరో ముగ్గురు అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. ఇక రాష్ట్రీయ జనతాదళ్‌ పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో ఓబీసీలకు 69 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23, షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారికి 18, ముస్లింలకు 19 టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ తరఫున పోటీ చేసిన మరో 14 మంది అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. అయితే వారిలో ఎక్కువ మంది ఓబీసీలేనని అర్థం అవుతోంది. జేడీయూ విషయానికొస్తే ఓబీసీలకు 59 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23 టిక్కెట్లు, షెడ్యూల్డ్‌ కులాలకు 18, ముస్లింలకు 11, షెడ్యూల్డ్‌ తెగలకు ఒక టిక్కెట్‌ కేటాయించారు. ముగ్గురు అభ్యర్థుల వివరాలు తెలియరాలేదు. 

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధానంగా అగ్రవర్ణాల వారికే ఎక్కువ సీట్లను కేటాయించగా, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు వెనకబడిన వర్గాల వారికే కేటాయించాయి. ఇక అగ్రవర్ణాల్లో ఏ సామాజిక వర్గానికి పార్టీలు ఎక్కువ టిక్కెట్లు కేటాయించాయో పరిశీలిస్తే ఏ వర్గానికి ఆ పార్టీలు ప్రాధన్యత ఇచ్చాయో కూడా స్పష్టం అవుతుంది. బీజేపీ 24.5 శాతం టిక్కెట్లను రాజ్‌పుత్‌లకు, 11.8 శాతం టిక్కెట్లు బ్రాహ్మణులు, 7.3 శాతం టిక్కెట్లు భూమిహార్లు, బిహార్‌లో ఓబీసీలుగా పరిగణించే కొమట్లు కూడా వారి జనాభాతో పోల్చి చూస్తే ఎక్కువగానే ఇచ్చింది. 

ఇక ఓబీసీల్లో యాదవ్‌లకు 13.6 శాతం, ఇతర ఓబీసీలకు 22 శాతం టిక్కెట్లు కేటాయించింది. జనతాదళ్‌ యూ పార్టీ ఓబీసీల్లో కుర్మీలకు 14 శాతం, యాదవ్‌లకు 13 శాతం టిక్కెట్లను కేటాయించగా, యాదవ్‌లు, కుర్మీలు కాకుండా ఇతర ఓబీసీలకు 25 శాతం టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ 31 శాతం టిక్కెట్లను యాదవ్‌లకు, మిగతా శాతం టిక్కెట్లను మిగతా అన్ని వర్గాలకు కేటాయించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అగ్రవర్ణాల వారికి 40 శాతం టిక్కెట్లను, ముస్లింలకు 17 శాతం  టిక్కెట్లను కేటాయించింది. బీజీపీ కారణంగా 2000 సంవత్సరం నుంచి బీహార్‌ ఎన్నికల్లో ఠాకూర్ల ప్రాబల్యం పెరగతూ వస్తోంది. అందుకనే ఆ రాష్ట్రంలో బీజేపీని రాజ్‌పుత్‌ల పార్టీగా వ్యవహరిస్తున్నారు. 

తగ్గిన మహిళల ప్రాతినిధ్యం 
గత అసెంబ్లీ కన్నా ఈసారి ఎన్నికల్లో పలు పార్టీల తరఫున ఎక్కువ మంది మహిళలు పోటీ చేసినప్పటికీ తక్కువ మంది విజయం సాధించడం గమనార్హం. 2015 ఎన్నికల్లో 273 మంది మహిళలు పోటీ చేయగా, ఈసారి 371 మంది పోటీ చేశారు. వారిలో మహా కూటమి తరఫున 62 మంది పోటీ చేయగా, ఏన్డీయే తరఫున 37 మంది పోటీ చేశారు. గత ఎన్నికల్లో 28 మంది మహిళలు విజయం సాధించగా, ఈసారి 26 మంది మాత్రమే విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement