2022 Round Up: Telangana Politics Special Story - Sakshi
Sakshi News home page

REWIND 2022 : తెలంగాణ రాజకీయం.. గరం గరం..

Published Thu, Dec 29 2022 4:24 AM | Last Updated on Thu, Dec 29 2022 8:25 AM

2022 Round up  telangana politics special story - Sakshi

రాష్ట్రంలో రాజకీయాలు 2022లో మరింతగా వేడెక్కాయి.  అసెంబ్లీ ఎన్నికలకు ముందటి సంవత్సరం కావడం, బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్‌ చేయడం.. ఎలాగైనా తిరిగి పట్టుపెంచుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నించడం.. రాష్ట్రంలో మూడోసారీ అధికారాన్ని నిలబెట్టుకోవడం, జాతీయ స్థాయిలో ప్రభావం చూపడం లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ వ్యూహాలు జనంలో ఉత్కంఠ రేపాయి. ఈ ఏడాది ప్రజల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన ప్రధాన రాజకీయ పరిణామాలు పార్టీల వారీగా ఇవీ..
– సాక్షి, హైదరాబాద్‌ 

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ పార్టీగా 2001లో తెరపైకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి 2022లో కొత్త ప్రస్థానం దిశగా ప్రయాణం ప్రారంభించింది. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెడు తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 5న దసరా సందర్భంగా తెలంగాణభవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీలో తీర్మానం చేశారు. డిసెంబర్‌ 9న తెలంగాణభవన్‌లో భారతదేశ చిత్రంతో కూడిన బీఆర్‌ఎస్‌ గులాబీ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. డిసెంబర్‌ 14న దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

‘మునుగోడు’లో కీలక పోరు
ఈ ఏడాది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)కు ప్రతిష్టాత్మకంగా మారింది. దీనిపై ముందుగానే అప్రమత్తమైన సీఎం కేసీఆర్‌.. ప్రజాదీవెన పేరిట ఆగస్టు 20న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించి పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికకు సన్నద్ధం చేశారు.

దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని అమలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలను రంగంలోకి దింపి మునుగోడులో విజయం సాధించారు. దీనితో అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం 104కు చేరింది.
‘ఎమ్మెల్యేలకు ఎర’తో సంచలనం
నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే వార్తలు అక్టోబర్‌ చివరి వారంలో రాష్ట్రంలో సంచలనం రేపాయి. హైదరా బాద్‌ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డితో మంతనాలు జరిపేందుకు వచ్చిన రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్‌లను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాతి పరిణామాలు టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ పోరును మరింత తీవ్రం చేశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు సీబీఐ నోటీసులు, ఈడీ, ఐటీ దాడులతో బీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెరిగింది. 

కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి కమలం 
రాష్ట్ర బీజేపీ కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2022 సంవత్సరమంతా బీజేపీ దూకుడుగా ముందుకు సాగింది. పార్టీ అధిష్టానం అండదండలతో బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)కు వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసనల పర్వాన్ని కొనసాగించింది.

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో అధికారికంగా ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’ నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించడం, కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అన్నట్టుగా బీజేపీ సంకేతాలు పంపింది.


‘అగ్ర త్రయం’ అండదండలతో..
రాష్ట్రంలో అధికార సాధన లక్ష్యంగా బీజేపీ జాతీయ అధినాయకత్వం రాష్ట్ర పార్టీకి పూర్తి అండదండలు అందించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఈ ఏడాదిలోనే ప్రధాని మోదీ 4 సార్లు, అమిత్‌షా, నడ్డా ఐదేసి పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనన్ని సభలు, సమా వేశాలను బీజేపీ నిర్వహించడం గమనార్హం. 

వరుస చేరికలతో..
బీజేపీ నేత ఈటల రాజేందర్‌ నేతృత్వంలోని చేరికల కమిటీ ఈ ఏడాది ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మర్రి శశిధర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జిట్టా బాలాకృష్ణారెడ్డి, రామారావు పటేల్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రామచంద్రనాయక్, న్యాయవాది రచనారెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. అయితే పార్టీలోకి వచ్చిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, భిక్షమయ్యగౌడ్‌ వంటివారు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర ఈ ఏడాది 2, 3, 4, 5 దశలు పూర్తిచేసుకుంది.

విభేదాలు, ఎదురుదెబ్బల ‘హస్తం’! 
రాష్ట్ర కాంగ్రెస్‌కు ఈ ఏడాది గొడవలతోనే సరిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివాదాలు మరింత ముదరడంతో పార్టీ హైకమాండ్‌ పలుమార్లు కల్పించుకోవాల్సి వచ్చింది. మరోవైపు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపించినా.. ఉప ఎన్నికలో ఓటమి ఎదురుదెబ్బ తప్పలేదు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ డిపాజిట్‌ కోల్పోయింది.
నిలువునా చీలిపోయి..
నిజానికి నవంబర్‌లో జరిగిన మునుగోడు ఎన్నికల నాటి నుంచి బహిరంగంగానే విమర్శ లు, ఆరోపణలు మొదలయ్యాయి. డిసెంబర్‌లో జరిగిన టీపీసీసీ కమిటీల నియామకాలతో వివాదాలు తారస్థాయికి చేరాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచీ సీనియర్లు, జూనియర్లుగా కొనసాగిన విభేదం.. ఒరిజినల్, వలస నేతలుగా మారింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ నిలువునా చీలిపోయింది. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్‌ నేతలు భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు ప్రత్యేకంగా సమావేశమవడం కలకలం రేపింది. దీంతో చక్కదిద్దే చర్యలు చేపట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం.. పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను రంగంలోకి దింపింది.

జోడో యాత్రతో కాస్త ఊపు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఈ ఏడాది కాంగ్రెస్‌లో కాస్త ఉత్సాహం నింపింది. అక్టోబర్‌ 23న నారాయణపేట జిల్లాలో ప్రారంభమైన యాత్ర నవంబర్‌ 7 వరకు సాగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల మీదుగా సాగి మహారాష్ట్రలోకి ప్రవేశించింది. తెలంగాణ పొడవునా జరిగిన యాత్రకు ప్రజల ఆదరణ కనిపించింది.

పాదయాత్ర, పోరాటాలతో జనంలోకి వైఎస్సార్‌టీపీ 
తెలంగాణలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను తీసుకువస్తానంటూ ఏర్పాటైన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సా ర్‌టీపీ) ప్రజలకు కొత్త గొంతుకగా మారింది. పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. పాదయాత్ర, పోరాటాలతో ముందుకు వెళుతున్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు చేవెళ్లలో ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 3,500 కి.మీ. మైలురాయి అధిగమించింది. పాద యాత్ర మధ్యలో నిరుద్యోగులు, రైతులు, వివిధ వర్గాల సమస్యలపై షర్మిల దీక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం, ఎమ్మెల్యేల అవినీతిని ప్రస్తావిస్తూ.. వివిధ వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తున్నారు.

ప్రజలతో మమేకం అవుతున్నా రు. ప్రాజెక్టులు, వివిధ పథకాల్లో అవినీతిని నిలదీయడమేగాకుండా.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు కూడా చేశారు. ఆమె పాదయాత్ర ముగింపు దశలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి, ప్రతిగా ప్రగతిభవన్‌ ముట్టడికి షర్మిల ప్రయత్నించడం, ఆమె అరెస్టు, నిరసనగా నిరాహార దీక్ష వంటి ఘటనలు కలకలం రేపాయి. షర్మిలకు ఆమె తల్లి విజయమ్మ కూడా అండగా నిలిచి.. తన కుమార్తెను దీవించాలని ప్రజలను కోరారు. షర్మిల పాలేరులో వైఎస్సార్‌టీపీ ఆఫీస్‌కి భూమి పూజ చేసి.. తాను అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు.
బహుజనవాదంతో బీఎస్పీ 
గత సంవత్సర కాలంలో చేపట్టిన పోరాటాలతో రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) జవజీవాలు పోసుకుంది. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. తన పాదయాత్రతో, వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లారు. గ్రామాలవారీగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం.. నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనితీరును తీవ్రంగా ఎండగట్టడం వంటివి చేపట్టారు.

పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న ఆయన ఈ ఏడాదే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఎస్పీ పోటీకి దిగింది. ప్రవీణ్‌కుమార్‌ స్థాపించిన స్వేరోస్‌తో పాటు పలు దళిత సంఘాలు బీఎస్పీకి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ కూడా కనిపించింది. 

బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ‘లెఫ్ట్‌’ అడుగులు 
రాష్ట్రంలో ఈ ఏడాది కమ్యూనిస్టులు బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఆ దిశగానే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ వెంట నిలిచి ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డారు. ఇదే సమయంలో భవిష్యత్తులోనూ బీజేపీని ఎదుర్కొనే పార్టీలకు తమ మద్దతు ఉంటుందనీ సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటనలు చేయడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలచిన స్థానాలపై వామపక్షాలు ఈ ఏడాది ప్రత్యేకంగా దృష్టిసారించాయి. 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం పెంచుకోవాలని, పొత్తులపై స్పష్టత వస్తే సరి, లేకుంటే ఈ సీట్లలో పోటీ చేస్తామని సీపీఐ పార్టీ కార్యదర్శి కూనంనేని పేర్కొన్నారు కూడా. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటే కొత్తగూడెం నుంచి పోటీచేయాలని కూనంనేని భావిస్తున్నారు. ఇక సీపీఎం పాలేరుతోపాటు మరికొన్ని స్థానాలపైనా దృష్టి సారించింది. ఈసారి సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కారు సహా పలువురు జాతీయ నేతలు ఇందులో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement