సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు యువ నేత ఆదిత్య ఠాక్రే నడుం బిగించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గంలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో చీలికలను అరికట్టేందుకు మూడు రోజులపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలైన భివండీ, నాసిక్, దిండోరీ, సంభాజీనగర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో ఆదిత్య ఠాక్రే పర్యటించనున్నారు. ఆ తరువాత రెండో దశ పర్యటనలో మరికొన్ని నగరాలు, పట్టణాలను ఎంచుకోనున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే ‘మన భగ్‌వా (కాశాయం జెండా)–మనదే శివసేన’ అనే నినాదంతో ప్రధాన నగరాలు, పట్టణాలను పర్యటిస్తూ ప్రజలతో సంప్రదింపులు జరుపనున్నారు. అదేవిధంగా నియోజక వర్గాలలోని శివసేన ప్రతినిధులు, పదాధికారులు, కార్యకర్తలతో చర్చిస్తారు. శిందే వర్గంలో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత ఏక్‌నాథ్ శిందే బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని విధంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గట్ నాయకులు, శాఖ ప్రముఖులు, విభాగ ప్రముఖులు, కార్పొరేటర్ స్ధాయి నుంచి ఎమ్మెల్యేల స్ధాయి వరకు ఇలా అనేక మంది శిందే వర్గంలో చేరుతున్నారు.
తాజాగా మరో 12 మంది శివసేన ఎంపీలు శిందే వర్గంలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా దశల వారిగా కిందిస్ధాయి కార్యకర్త నుంచి పైస్ధాయి ఎంపీల వరకు శివసేనతో తెగతెంపులు చేసుకుంటున్నారు. శిందే వర్గంలో చేరికల వల్ల శివసేన రోజురోజుకూ బలహీన పడుతోంది. పదాధికారులు, కార్యకర్తలు మనోస్ధైర్యాన్ని కోల్పుతున్నారు. చీలికలను నియంత్రించేందుకు శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేనా భవన్‌లో ఉద్ధవ్ ఠాక్రే తరచూ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ పార్టీ నుంచి బయటపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై పడుతున్న అదనపు భారాన్ని కొంతమేర తన భుజస్కందాలపై వేసుకోవాలని ఆదిత్య భావించారు.
అందులో భాగంగా ఇటీవల నెలకొన్న తాజా పరిణామాలతో ఆత్మస్ధైర్యం కోల్పోయిన శివసైనికులను ఓదార్చడం, వారికి మనోధైర్యాన్ని నూరిపోసేందుకు యువనేత నడుం బిగించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుగుబాటు చేసిన ఏక్‌నాథ్ శిందే, ఆయన శిబిరంలో చేరిన మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు గుప్పించనున్నారు. వీరంతా శివసేనను మోసగించిన తీరును ప్రజల ముందు ఎండగట్టనున్నారు. బలహీనపడుతున్న శివసేనను తిరిగి పటిష్టం చేయడానికి తనవంతుగా ప్రయత్నం చేయనున్నారు. బాల్ ఠాక్రే బతికుండగా శివసేన పార్టీ గర్జించే సింహం లాగా కనిపించేదని, ఇప్పుడు అదేవిధంగా శివసేన పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment