న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇంటితో పాటు అన్నిరకాల సౌకర్యాలను వదులుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన భద్రతపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈక్రమంలో కేజ్రీవాల్ జాతీయ పార్టీ కన్వీనర్‌గా ఉన్నందున ఆయనకు ప్రభుత్వ వసతి కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలమంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో జాతీయ కన్వీనర్‌కు వసతి కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి జాతీయ పార్టీకి ఢిల్లీ నుంచి పనిచేయడానికి ఓ కార్యాలయంతోపాటు దాని అధినేతకు ఒక వసతి ఉంటుందని తెలిపారు. రెండేళ్ల పోరాటం, కోర్టు జోక్యంతో కేంద్రం ఆప్‌కి కార్యాలయాన్ని అందించింది. ఆప్ గత నెలలో మండి హౌస్‌లోని రవిశంకర్ శుక్లా లేన్‌లో ఉన్న తన కొత్త కార్యాలయానికి మారింది. అంతకముందు ఐటీఓ సమీపంలోని డీడీయూ మార్గ్‌లో ఆప్ కార్యాలయం ఉండేది.
‘ఎలాంటి జాప్యం లేకుండా, రాజకీయ ద్వేషం లేకుండా నిబంధనలను అనుసరించాలని, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వ వసతి కల్పించాలని నేను కేంద్రాన్ని కోరుతున్నాను, ఇది ఆయనతోపాటు, ఆమ్ ఆద్మీ పార్టీ హక్కు .
బీజేపీకి చెందిన జేపీ నడ్డా, కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే, బీఎస్పీ మాయవతి సహా దేశంలోని ఆరు జాతీయ పార్టీల అధ్యక్షులకు దేశ రాజధానిలో ప్రభుత్వ వసతి కల్పించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వ వసతి కోసం ఆప్ న్యాయ పోరాటం చేయనవసరం లేదని భావిస్తున్నాం రాఘవ్ చద్దా ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే రెండు రోజులకే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు అందజేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా అతిషికి బాధ్యతలు అప్పగించారు.
శనివారమే ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే 15 రోజుల్లో కేజ్రీవాల్ అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారని ఆప్ ఇది వరకే ప్రకటించింది. కాగా 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment