
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే దేశంలో ఉగ్రవాదాన్ని, అవకతవకలను పెంచి పోషించడమే అవుతుందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేది లేదని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి కూడా లేదని, అవి ఒట్టి గారడీ మాటలేనని విమర్శించారు.
శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ల సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, నర్సంపేటకు చెందిన రాణా ప్రతాప్‌రెడ్డి, పలువురు పట్టణ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.
రెండు నెలల్లో పలు రాజకీయ మార్పులు
ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకోనున్నాయని, బీజేపీలోకి చేరికలు పెరుగుతాయని కిషన్‌రెడ్డి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో కొత్త చరిత్ర లిఖించబోతున్నామని, అందులో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యం కాబోతున్నారని అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు బీజేపీ గెలిచి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడి, రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.
స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వం చేయలేని పనులు, పాలనా సంస్కరణలు, అనేక రకాల చట్టాలు, భారతీయ అధ్యాత్మిక, సంస్కృతిని పునరుద్ధరించే కార్యక్రమాలు మోదీ నాయకత్వంలో చేపట్టారని చెప్పారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ మంత్రులు కుంభకోణాలతో కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈటల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో రాష్ట్రంలో అధికారం సంపాదించిందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ అంతరించిపోయే స్థితిలో ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment