జైపూర్: రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇది కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్ష
రాష్ట్రంలో జరిగిన ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే దానిపై న్యాయ మంత్రి జోగారామ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. దీనిని సీఎం భజన్‌లాల్ శర్మకు అందించింది. దీనిపై సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
కొత్త జిల్లాలపై నిర్ణయం
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 17 కొత్త జిల్లాల భవిష్యత్తుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ నివేదిక రూపొందించింది. ఐదు చిన్న జిల్లాలను మళ్లీ పాత జిల్లాల్లో కలపవచ్చని సమాచారం. డిసెంబరు 31లోగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
గత ప్రభుత్వ నిర్ణయాలు రద్దు
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు వైద్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వసర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను రూపొందించింది. దీనిని త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూకేటాయింపులతోపాటు పలు నిర్ణయాలను కమిటీ పరిశీలించింది.
ఒకే రాష్ట్రం- ఒకే ఎన్నికలు
రాష్ట్ర ప్రభుత్వం కూడా వన్ స్టేట్- వన్ ఎలక్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి కొంత సమయం అవసరం ఉంటుంది. దీనిపై చర్చించేందుకు ఒక కమిటీని నియమించి. ఆ తర్వాత ఒక రాష్ట్రం- ఒక ఎన్నికల అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన
Comments
Please login to add a commentAdd a comment