ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు దక్కాయి.
ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి నేతలకు పలు మంత్రి పదవులు వరించాయి.
అయితే మోదీ కేబినెట్ కూర్పుపై మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్ మంత్రి ఆశిస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు ఎన్డీయే ఇతర భాగస్వామ్య పక్షాలకు దక్కిన పదవులను ప్రస్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బర్నే మాట్లాడుతూ.. ఐదుగురు ఎంపీలు కలిగిన చిరాగ్ పాశ్వాన్, ఒక ఎంపీ కలిగిన జితన్ రాం మాంఝీ, ఇద్దరు ఎంపీలు కలిగిన జేడీఎస్‌లకు ఒక్కో క్యాబినెట్ మంత్రి పదవిని కేటాయించారని.. తమను మాత్రం ఒకే ఒక్క సహాయ మంత్రి పదవికి పరిమితం చేశారని వాపోయారు.
ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్‌కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవితో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment