
అన్నాడీఎంకే రాజకీయ వివాదాలకు తెరపడేనా అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది. సీఎం అభ్యర్థి ఎవరో తేల్చేనా లేదా, నాన్చేనా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఆమేరకు బుధవారం అన్నాడీఎంకేలో కీలక సమావేశం జరగనుంది. ఆ తర్వాత ప్రకటన వెలువడనుంది.
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న కుర్చీ కొట్లాట గురించి తెలిసిందే. వారం రోజులుగా ఓ వైపు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ , డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, మరో వైపు కో కన్వీనర్, సీఎం పళనిస్వామి వేర్వేరుగా మద్దతు నేతలతో మంతనాల్లో మునిగారు. మంగళవారం కూడా మంతనాలు జోరుగానే సాగాయి. మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, తంగమణి, ఆర్‌బీ ఉదయకుమార్ గంటల తరబడి పన్నీరుతో ఓ వైపు, పళనితో మరో వైపు సమావేశమయ్యారు.
ఇక, తన నివాసంలో సమన్వయ కమిటీ ప్రతినిధులు వైద్యలింగం, కేపీ మునుస్వామిలతో పన్నీరుసెల్వం పొద్దుపోయే వరకు సమావేశం అయ్యారు. సీఎం అభ్యర్థి, ప్రధాన కార్యదర్శి వ్యవహారం, మార్గదర్శక కమిటీ ఎంపిక, ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలో అనే విషయంగా సుదీర్ఘంగానే సమాలోచన సాగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్గదర్శక కమిటీ పారీ్టకి కీలకం కానున్న దృష్ట్యా, అందులో చోటు దక్కించుకునేందుకు సీనియర్లు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు.
నేడు కీలక ప్రకటన..
ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాల్సి ఉంది. మార్గదర్శక కమిటీ విషయంగా కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే, ప్రధాన కార్యదర్శిగా దివంగత సీఎం జయలలితే శాశ్వతం అని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఆ పదవి విషయంగా ఎలాంటి నిర్ణయం తాజాగా వెలువడుతుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. పన్నీరు, పళనిల మధ్య బయలుదేరిన ఈ కుర్చీ కొట్లాటలో కేంద్రం పెద్దలు సైతం జోక్యం చేసుకునిన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ దృష్ట్యా, బుధవారం జరిగి పార్టీ సమావేశం వ్యవహారాలన్నీ సామరస్యపూర్వంగానే సాగే అవకాశాలు ఉన్నాయని, ఐక్యతతో ప్రకటన చేయవచ్చన్నట్టుగా సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.
ఇక 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉండడంతో సీఎం అభ్యర్థి ఎవరో తాజాగా ప్రకటించే అవకాశాలు తక్కువేనని పేర్కొనడం గమనార్హం. మార్గదర్శక కమిటీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు మరో రోజు సీఎం అభ్యర్థి విషయంగా నిర్ణయం తీసుకోవచ్చని ఓ నేత పేర్కొన్నారు. ఈ మంతనాల గురించి మంత్రి జయకుమార్‌ను కదిలించగా, ఇక, అన్నీ గోల్డెన్ డేస్ అని వ్యాఖ్యానించారు. అమ్మ పాలన మళ్లీ రావాలన్న సంకల్పంతో సమష్టిగా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువేనని స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పన్నీరే సీఎం అంటూ కొన్నిచోట్ల, పళని సీఎం అభ్యర్థి అంటూ మరి కొన్ని చోట్ల మద్దతుదారుల పోస్టర్లు హల్‌చల్ చేశాయి. (తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్ )
నేనే ప్రిసీడియం చైర్మన్..
అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా మధుసూదన్ ఉన్న విషయం తెలిసిందే. వయోభారం దృష్ట్యా, ఆయన్ను పక్కన పెట్టవచ్చన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మధుసూదన్ మీడియా ముందుకు వచ్చారు. తాను జీవించి ఉన్నంత కాలం ప్రిసీడియం చైర్మన్‌గానే వ్యవహరించడం జరుగుతుందని, ఇది అమ్మ జయలలిత తనకు ఇచ్చిన పదవి అని వ్యాఖ్యానించారు. ధర్మయుద్ధంలో పన్నీరు విజయం సాధిస్తారని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment