
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రస్తుత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు లాంటి పథకంపై హామీ ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నేతలకు సూచించినట్లుగా తెలిసింది. ఆర్థిక పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పురోభివృధ్ధి సాధించేలా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా చెప్పారని సమాచారం.
ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు గడ్డం వినోద్, ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, గంగారాం, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం చైర్మన్ బెల్లయ్యనాయక్ తదితరులు ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.
ఈ నెల 26న చేవెళ్ల సభలో ప్రకటించాల్సిన దళిత, గిరిజన డిక్లరేషన్ అంశాలపై గంటన్నర పాటు చర్చించారు. కొందరు నేతలు దళితబంధు వంటి పథకాన్ని ప్రకటించాలని అన్నారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. ‘దళితబంధు లాంటి పథకం అమలు సాధ్యాసాధ్యాలు, అవసరమయ్యే నిధులపై లోతుగా చర్చించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్ర మండలం మీది భూములమ్మైనా దళితబంధు అమలు చేస్తామని అంటున్నారు.
ఆయన మాటలు పట్టుకొని మనం కూడా చంద్ర మండలం మీద భూములమ్ముతామని ప్రజలకు చెప్పలేం కదా? ఇలాంటి హామీలు ఇచ్చేముందు ఆర్థికపరమైన అంశాలతో పాటు రాష్ట్ర బడ్జెట్‌ను అధ్యయనం చేయాలి. సాధ్యాసాధ్యాలను పరిశీలించే హామీలివ్వాలి. హామీల ప్రకటన ఎలాంటిదైనా అన్ని వర్గాలు, మేధావులు, సీనియర్లతో చర్చించే చేయాలి తప్ప తొందరపాటుతో కాదు..’అని స్పష్టం చేసినట్లు తెలిసింది.
సీట్లు కాదు..గెలుపు ముఖ్యం
కొందరు నేతలు జనరల్ స్థానాల్లోనూ ఎస్సీలకు సీట్లు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై స్పందిస్తూ.. ‘సీట్లు ముఖ్యం కాదు..గెలవడం ముఖ్యం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. ఆ దిశగా పనిచేయండి.
కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత, గిరిజనులకు పార్టీ పట్ల నమ్మకం పెంచండి..’అని ఖర్గే సూచించినట్లు సమాచారం. పోడు భూములపై హక్కులు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు, గృహ నిర్మాణాలు వంటి హామీలపై కూడా చర్చించినా, పూర్తి స్థాయి అధ్యయనం చేశాకే వీటిపై తుది ప్రకటన చేద్దామని చెప్పినట్లు తెలిసింది.
ఆర్థిక, సామాజిక అంశాలు పరిగణనలోకి: భట్టి
చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై ఖర్గే చర్చించినట్లు భేటీ అనంతరం భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ యా వర్గాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపైనా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని డిక్లరేషన్ ప్రకటన ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment