ఆమనగల్లు, బన్సీలాల్‌పేట్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే ఆ మూడు పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో శనివారం కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి మద్దతుగా నిర్వహించిన విజయభేరి సభకు పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, కర్ణాటక విద్యాశాఖ మంత్రి సుధాకర్‌రెడ్డితో కలిసి ఖర్గే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు పదేళ్ల కితమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా.. ఇంకా వారి ఆశలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే వారి ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ అబద్ధాల కోరులేనని, తోడుదొంగలని ధ్వజమెత్తారు. వారిద్దరి మధ్య అనేక విషయాల్లో చీకటి ఒప్పందం సాగుతోందని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో పేదల జీవనం దుర్భరంగా మారితే, కేంద్రంలో మోదీ హయాంలో నిత్యావసరాలతో పాటు పెట్రోలు, డీజీల్ ధరలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ కేవలం అదానీ లాంటి బడా వ్యాపారస్తులకు మాత్రమే మేలుచేస్తూ పేదలను పట్టించుకోలేదని మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిపై రూ.1.40 లక్షల అప్పు ఉందని వివరించారు.
కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి రేవంత్ పిలుపు
దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు ఇవ్వని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు వేయడానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న కేసీఆర్, దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు నిధులు ఇవ్వడానికి ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు. సభలో ఏఐసీసీ కార్యదర్శి నాజిర్ హుస్సేన్, సందీప్, పరిశీలకుడు మోహన్‌జీ, బీహార్ సీఎల్‌పీ నాయకుడు షకీల్ ఆహ్మద్ ఖాన్, మాజీ ఎంపీ మల్లురవి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
కవితను ఎందుకు అరెస్టు చేయలేదు
హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ప్రధాని, హోంమంత్రి కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడతారని, అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేక మందిని అరెస్టు చేసిన మోదీ ప్రభుత్వం కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచానెహ్రునగర్‌లో శనివారం జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చారు. సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ, టీపీసీసీ పరిశీలకులు మాణిక్‌రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
ఆ మూడు పార్టీలూ ఒక్కటే
Published Sun, Nov 26 2023 4:47 AM | Last Updated on Sun, Nov 26 2023 4:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment