ఏలూరు టౌన్: ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని.. వారికి అండగా నిలబడి భరోసా కల్పించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ధ్వజమెత్తారు. ఏలూరులో పారిశుధ్యానికి సంబంధించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉంటే రాజకీయాలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. ఏలూరు ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనతో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి దుష్టరాజకీయాలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్పత్రిలో పరామర్శించారని, ఇక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్షించి సత్వర వైద్య సేవలకు ఆదేశించారని గుర్తు చేశారు. దానిపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించటం దుర్మార్గమన్నారు. 40 ఏళ్ల అనుభవంతో మంచిగా సూచనలు, సలహాలు చేయటం మానేసి ఇలా నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. ఎక్కడో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనా«థ్‌రెడ్డికి ఏలూరులోని అంతుచిక్కని వ్యాధికి సంబంధం అంటగట్టటానికి చంద్రబాబుకు నోరెలా వచ్చిందో అర్థం కావట్లేదన్నారు.
బాబుపై దృష్టి పెట్టేంత సమయం లేదు
తమకు చంద్రబాబుపై దృష్టిపెట్టే ఆలోచన గాని, అంత సమయం గాని లేదని మంత్రి నాని స్పష్టం చేశారు. తమ దృష్టి అంతా ప్రజలపైనే ఉంటుందని, వారికి ఏ విధంగా సాయం చేయాలి, ఏ విధంగా అండగా నిలబడాలనే దృష్టితోనే తాము పని చేస్తామే తప్ప చవకబారు రాజకీయాలు చేయటం రాదన్నారు. ఏలూరు ప్రజలకు అండగా ఉంటూ వ్యాధిని నిర్మూలించేందుకు, మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిత్యం ఏలూరు పరిస్థితులపై సమీక్షిస్తూ, ముందుస్తు చర్యలకు ఆదేశాలిస్తున్నారని చెప్పారు. నగరంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకునేందుకే తాను పాదయాత్ర చేపట్టానని మంత్రి నాని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment