తాళ్లపూడి/పోలవరం రూరల్: నిజం గెలవాలని కాకుండా.. అబద్ధం గెలవాలంటూ చంద్రబాబు భార్య భువనేశ్వరి యాత్ర చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నిజం గెలిస్తే బాబు ఎప్పటికీ జైలు నుంచి బయటకు రారన్నారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కక్షా లేదని మంత్రి పునరుద్ఘాటించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తాడిపూడిలో ప్రభుత్వ శాశ్వత భవనాలను హోం మంత్రి తానేటి వనితతో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబటి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన తప్పులే ఆయనను జైలుకు పంపాయన్నారు. నేరాలున్నందునే బెయిల్ కూడా రాలేదని తెలిపారు. అంతేగానీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ఎక్కడా వ్యహరించడం లేదని చెప్పారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని గత ప్రభుత్వం చేసిన తప్పులు, దోపిడీకి ఆయన కూడా బాధ్యత వహించాలన్నారు. నాడు పవన్ మద్దతు ఇవ్వకుంటే ఇన్ని తప్పులు జరిగేవి కాదని చెప్పారు.
‘కాపు ఉద్యమ సమయంలో ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ఇబ్బందులు పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నావు పవన్.., అసలు నీకు కాపులు ఎందుకు మద్దతివ్వాలి’? అని ప్రశ్నించారు. న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుబడుతున్నారని అలాంటి సొంత పుత్రుడు, దత్త పుత్రులను ఎలా నమ్మాలన్నారు. చంద్రబాబుకి స్కాంలో పాత్ర ఉందని తెలిసే సీబీఐ కోర్టులో, హైకోర్టులో, చివరకు సుప్రీం కోర్టులో కూడా రిలీఫ్ దొరకలేదని అంబటి చెప్పారు.
జలశక్తి నిర్ణయాల మేరకు ప్రాజెక్టు నిర్మాణం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణాలు కేంద్ర జలశక్తి సంఘం నిర్ణయాల మేరకు ఆధారపడి ఉంటాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం మంత్రి అంబటి.. ప్రాజెక్టు ఇంజనీర్‌లతో కలిసి పనులను పరిశీలించారు. పనుల వివరాలను ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి ఆయనకు వివరించారు. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌ల మధ్య ఉన్న సీఫేజ్ నీటిని మళ్లించేందుకు నిర్మాణం చేస్తున్న కాలువ పనులను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment