సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. నీకు మతి భ్రమించిందా? పట్టపగలే మందు కొట్టావా? విశాఖ వీధుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇష్ట మొచ్చినట్టు తిడతావా? ఫ్రస్ట్రేషన్‌తో దిగజారి మాట్లాడతావా?’ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. శవాలను పీక్కుతినే రాబందులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కును రక్షించుకునే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషిని ప్రజలు, కార్మిక సంఘాలు అభినందిస్తుంటే.. ఆయన మాత్రం జనాన్ని రెచ్చగొట్టే నీతి మాలిన రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి కనీసం లేఖ రాసే ధైర్యం చేయడం లేదని దుయ్యబట్టారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..
జగన్ మాటపై అపార నమ్మకం
♦శారదపీఠం వార్షికోత్సవానికెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విశాఖలో కార్మిక సంఘాలను కలిశారు. వారితో గంటన్నర పాటు చర్చించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వం చేస్తున్న కృషి, కేంద్రంపై తెస్తున్న ఒత్తిడి గురించి వివరించారు.
♦ఫ్యాక్టరీని లాభాల్లోకి ఎలా తేవాలో కేంద్రానికి సూచించినట్టు చెప్పారు. టీడీపీ అనుబంధ సంఘంతో సహా 14 కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి మాటలపై విశ్వాసం వ్యక్తం చేశాయి. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ప్రకటించాయి. చదవండి: (విశాఖ ఉక్కును కాపాడేందుకు కృషి: సీఎం జగన్)
చంద్రబాబు చేసిందేంటి?
♦విశాఖకు జగన్ వస్తున్నారని తెలిసే, చంద్రబాబు ఓ రోజు ముందే అక్కడకు వెళ్లారు. అక్కడ ఆయన చిల్లరగా మాట్లాడిన తీరు నవ్వొస్తోంది. పిరికి వాళ్లు ధైర్యం తెచ్చుకోవాలట. పోరాడుతున్న ప్రజలు పిరికి వాళ్లా?
♦ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసు కోవడం సబబేనా?
♦మా ఎంపీ విజయసాయిరెడ్డిపై మాట్లాడిన భాష ఏమిటి? ఇదేనా మీ రాజకీయ అనుభవం? పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు చావు దెబ్బ తినడంతో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు వైఎస్ జగన్ చేస్తున్న కృషి ఆయనకు కన్పించడం లేదు.
♦సమస్య వచ్చిందంటే చాలు.. శవాలను పీక్కుతినే రాబందులా చంద్రబాబు ఆనంద పడతారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలోనూ అంతే. చంద్రబాబు ఓ 420. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ బీజాలు చంద్రబాబు హయాంలోనే పడ్డాయి. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే అసెంబ్లీ తీర్మానం చేయడానికైనా మేము సిద్ధమే.
Comments
Please login to add a commentAdd a comment