బోల్‌పూర్‌లో రోడ్ షోకు హాజరైన జనం (ఇన్‌సెట్‌లో) అభివాదం చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
బోల్‌పూర్/శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)గా మారుస్తామని హామీ ఇచ్చారు. శనివారం తన రెండు రోజుల బెంగాల్ పర్యటనను ప్రారంభించిన అమిత్ షా ఆదివారం బోల్‌పూర్‌లో రోడ్ షోలో అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. భారత్ మాతా కీ జై, జైహింద్ అంటూ ప్రసంగం ప్రారంభించారు.
సీఎం మమతా బెనర్జీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. ఈ రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాపై ప్రజల విశ్వాసానికి, అభిమానానికి.. మమతా బెనర్జీపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పరిబర్తన్(మార్పు)కు ఓటు వేయాలని జనం నిర్ణయించుకున్నారని చెప్పారు. ఒక వ్యక్తిని పదవి నుంచి దించడానికి కాదు, బెంగాల్ అభివృద్ధి కోసమే ఈ మార్పు రావాలన్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను, రాజకీయ హింసను అరికట్టడానికి మార్పు రావాల్సి ఉందన్నారు. అవినీతి, వేధింపులు ఆగాలంటే మార్పు అవసరమన్నారు. మేనల్లుడి దాదాగిరిని(మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ) అడ్డుకోవడానికి మార్పు రావాలని వ్యాఖ్యానించారు.
ఠాగూర్, బోస్ కలలుగన్న రాష్ట్రంగా...
తాము అధికారం లోకి రాగానే పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ కలలుగన్న రాష్ట్రంగా బెంగాల్‌ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇక్కడి పాలకులు బెంగాల్‌ను అభివృద్ధి మార్గం నుంచి పక్కకు తప్పించారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటువేస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రగతి ఎక్కడైనా కనిపిస్తోందా? అని అమిత్ షా ప్రశ్నించగా.. లేదు అంటూ జనం బిగ్గరగా బదులిచ్చారు. తాను ఎన్నో రోడ్ షోలు నిర్వహించానని, పాల్గొన్నానని ఆయన చెప్పారు. ఇలాంటి భారీ రోడ్ షోను ఎప్పుడూ చూడలేదన్నారు.
విశ్వకవికి శ్రద్ధాంజలి
బెంగాల్‌లోని విశ్వభారతి సెంట్రల్ వర్సిటీని అమిత్ షా సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఠాగూర్ బోధనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతినికేతన్ విద్యాలయం భారతీయ సంస్కృతితో ఇతర దేశాలు అనుసంధానం కావడానికి వేదికగా ఉపయోగపడిందని కొనియాడారు. విశ్వభారతిలో ఠాగూర్ నివసించిన ఉత్తరాయణ్ కాంప్లెక్స్, ఉపాసన గృహను అమిత్ షా పరిశీలించారు. అనంతరం సంగీత భవన్‌లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే∙ఉన్న బంగ్లాదేశ్ భవన్‌కు వెళ్లారు.
జానపద గాయకుడి ఇంట్లో అమిత్ షా భోజనం
అమిత్ షా ఆదివారం బీర్భమ్ జిల్లా శాంతినికేతన్ సమీపంలో ఉన్న రతన్‌పల్లి గ్రామంలో బాసుదేబ్ దాస్ బవుల్ అనే జానపద గాయకుడి ఇంట్లో(మనోహర్‌ధామ్ కుటీర్) భోజనం చేశారు. నేలపై కూర్చొని సంప్రదాయ బెంగాలీ వంటకాలను ఆరగించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు. సూఫీ జానపద గీతాలను బాసుదేబ్ ఆలపిస్తుంటారు. బాసుదేవ్, ఆయన కుటుంబ సభ్యులు ఏక్‌తారా మీటుతూ పాడిన తోమయ్ హృద్ మజారే రఖ్‌బో(నిన్ను మా హృదయాంతర్భాగంలో నిలుపుకుంటాం) అనే పాటను అమిత్ షా శ్రద్ధగా విన్నారు. బాసుదేబ్ ఇంట్లోని శివాలయంలో పూజలు చేశారు. హోంమంత్రి రాక పట్ల బాసుదేబ్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment