అంగన్‌వాడీ వర్కర్ల ముసుగులో మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ మహిళా నేతలు
సాక్షి, మచిలీపట్నం: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్నన చూరగొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు పన్నిన కుట్ర బట్టబయలైంది. అంగన్‌వాడీల ధర్నాల వెనుక టీడీపీ, ఎల్లో మీడియా పాత్ర స్పష్టంగా బయటపడింది. తమను బెదిరించి, బలవంతంగా తీసుకువచ్చారని మచిలీపట్నంలో ధర్నాలో పాల్గొన్న పలువురు అంగన్‌వాడీలు చెప్పారు. తమకు మేలు చేస్తున్న జగనన్నకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం ఇష్టం లేదని వారు తేటతెల్లం చేశారు.
అంగన్‌వాడీలకు వేతనాల పెంపు, ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం మచిలీపట్నం ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నా కోసం నాలుగు రోజులుగా టీడీపీ నేతలు అంగన్‌వాడీ వర్కర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ధర్నాకు రావాలని బెదిరిస్తున్నారు. వారి నుంచి అంతగా స్పందన లేకపోవటంతో టీడీపీ శ్రేణులు, సీఐటీయూ నాయకులు కొందరు మహిళలకు డబ్బులిచ్చి ధర్నా చౌక్‌కు ఆటోల్లో తీసుకొచ్చారు. ఈ నేతల బెదిరింపులకు భయపడి కొందరు అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు ధర్నా సమయానికి అక్కడికి వచ్చారు. వారంతా ఒక చోట మౌనంగా కూర్చున్నారు. టీడీపీ మహిళా నేతలు అంగన్‌వాడీ నేతలమంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అంగన్‌వాడీ వర్కర్లకు మేలు జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్లకు చిర్రెత్తుకొచి్చ, ఎదురు తిరిగారు. చంద్రబాబు హయాంలో తమను ఎంత హీనంగా చూశారో వారికి గుర్తు చేశారు. గుర్రాలతో తొక్కించిన సంఘటనను మర్చిపోలేమని చెప్పారు. దీంతో టీడీపీ మహిళా నాయకురాలు ఆచంట సునీత, మరి కొందరు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఆందోళన చేయడం తమకు ఇష్టం లేదని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు వెల్లడించారు. చంద్రబాబునాయుడు హయాంలో తమను హీనంగా చూశారని, జగనన్న వచ్చాక వేతనాలు పెంచి గౌరవప్రదంగా చూసుకుంటున్నారని తెలిపారు. తమ డిమాండ్లను జగనన్న పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని, ఆందోళనలు అవసరం లేదన్నారు. జగనన్న అన్యాయం చెయ్యరనే నమ్మకం ఉందన్నారు. మమ్మల్ని కొందరు బెదిరించి, బలవంతం చేస్తే తప్పని పరిస్థితుల్లో ధర్నాకు వచ్చామని చెప్పారు.
మీకు దండం పెడతా పిడికిళ్లు బిగించి నినాదాలు చేయండి
ధర్నాలో పాల్గొన్న వారెవ్వరూ నినాదాలు చేయలేదు. మౌనంగా కూర్చుండిపోయారు. ఈ పరిణామాన్ని జీరి్ణంచుకోలేని ఎల్లో మీడియా ప్రతినిధులు సీఐటీయూ నాయకులను పక్కకు పిలిచి ఇలా మౌనంగా కూర్చుంటే టీవీల్లో, పత్రికల్లో చూపించలేమని చెప్పారు. టీవీ విజువల్స్, ఫొటోల కోసమైనా కాసేపు నినాదాలు చేయించమని కోరారు. దీంతో సీఐటీయూ నాయకులు ‘మీకు దండం పెడతాం. పిడికిళ్లు బిగించి కొద్ది సేపైనా చేతులెత్తి నినాదాలు చేయండి’ అంటూ ప్రాథేయపడ్డారు. అతి కొద్ది మంది మాత్రం చేతులెత్తి నినాదాలు చేశారు. మిగతా వారు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment