దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని వంతారా రిసార్టులో రెసెప్షనిస్ట్ హత్యకు గురైన ఘటన ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్‌కిత్ ఆర్యను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ మరునాడే ఆయన తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే జిల్లా పరిపాలనా యంత్రాంగం హత్యపై విచారణ జరిపి ఆ తర్వాత తమపై ఏ చర్యలు తీసుకున్నా ఓకే అని వినోద్ ఆర్య తెలిపారు. హరిద్వార్‌కు చెందిన ఈయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ మాటీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు, నిందితుడు పుల్‌కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్య ఓబీసీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సస్పెన్షన్‌తో ఇప్పుడు పదవి పోయింది.
రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య ఆదివారం జరగ్గా.. కాలువలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ తనయుడి క్రూర చర్యకు స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హత్య జరిగిన రిసార్టుకు నిప్పుపెట్టారు. హత్య ఘటన దురదృష్టకరం అని, పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఏం జరిగింది?
పుల్‌కిత్ ఆర్య యజమానిగా ఉన్న వంతారా రిసార్టులో పనిచేసే రిసెప్షనిస్ట్ అంకితా భండారీ ఆదివారం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. పుల్‌కిత్ ఆర్య కూడా ఏమీ తెలియనట్లు స్టేషన్‌కు వెళ్లి రిసెప్షనిస్ట్ కన్పించడం లేదని ఫిర్యాదు చేశాడు.
అయితే బాధితురాలి తల్లిదండ్రులు పుల్‌కిత్ ఆర్యపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. రిసార్టులో పనిచేసే మరో ఇద్దరు సిబ్బందితో కలిసి పుల్‌కిత్ ఆర్యనే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. అంకిత భండారీతో గొడవపడి ఆమెను రిసార్టు వెనకాల కాలువలోకి తోసేసినట్లు పుల్‌కిత్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
ఆరు రోజుల తర్వాత శవాన్ని గుర్తించారు. పుల్‌కిత్‌తో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్‌భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. అయితే తమ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాతే హత్యకు గురైందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద సాక్ష‍్యాధారాలు ఉన్నట్లు చెప్పారు.
చదవండి: యువతి హత్య కేసులో బీజేపీ నేత కుమారుడు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment