దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ అంకిత భండారీ గతవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య యువతి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. అయితే తన కూతుర్ని కడసారి కూడా చూసుకోనివ్వకుండా తనను ఏమార్చారని అంకిత తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తనను అధికారులు ఎలా మోసం చేశారో ఓ వీడియోలో చెప్పారు.
అంకిత మృతి వార్త తెలిసి ఆమె తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని ఆమె వెల్లడించింది. తన కూతుర్ని చూపిస్తామని చెప్పి నలుగురు వచ్చి అడవిలో ఉన్న తమను తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత తనతో అబద్దాలు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లి, వీల్‌ఛైర్‌లో బలవంతంగా కూర్చొబెట్టారని పేర్కొన్నారు. అనంతరం సెలైన్ పెట్టి ఫోటోలు తీసుకున్నారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నా కావాలనే ఇదంతా చేశారని వివరించారు. తాను ఎన్నిసార్లు అడిగినా తన కూతురి దగ్గరికే తీసుకెళ్తున్నట్లు చెప్పి నమ్మించి మోసం చేశారని వాపోయారు.
మరోవైపు తన భర్తను బలవంతంగా అంకిత మృతదేహం వద్దకు తీసుకెళ్లారని తల్లి ఆరోపించారు. తనను మాత్రం అంకితను కడసారి చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.
బీజేపీ నేత కుమారుడే..
బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో అంకిత భండారీ రిసెప్షనిస్టుగా పనిచేసేది. గత ఆదివారం ఆమె అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. నిందితుడు అంకిత్ ఆర్యతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని అరెస్టు చేశారు. శనివారం అంకిత మృతదేహం కాలువలో లభించింది. మొదట అంత్యక్రియలు నిర్వహించేందుకు ససేమిరా అన్నారు అంకిత తండ్రి. ఆ తర్వాత సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇచ్చిన హామీతో మనసు మార్చుకుని ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
చదవండి: గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ఇదే..
Comments
Please login to add a commentAdd a comment