
‘గతంలో కూడా ఇలానే ఫోటోలు వీడియోలు పంపారు. దయచేసి సభ్యుల సెల్‌ఫోన్లు బయటే ఉంచేలా అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి.
సాక్షి, అమరావతి: వ్యవసాయం దండగ అని చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటూ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ సభ్యులను విమర్శించారు. అసత్యాలు మాట్లాడటం, వెల్‌లోకి వెళ్లటం వాళ్లకు ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడ్డారు. నివర్ తుపాను నష్టం- ప్రభుత్వ చర్యలపై చర్చ శాసనమండలిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి కన్నబాబు... ‘‘లోకేష్ ట్రాక్టర్ తీసుకెళ్లి పెద్ద యాక్షన్ చేశాడు. ఆయనకు కనీసం ట్రాక్టర్ నడపడం కూడా రాదు. నాడు వ్యవసాయం దండగ అన్నారు. 9 నెలలు హైదరాబాద్‌లో దాక్కుని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తీరును ప్రస్తావిస్తూ చురకలు అంటించారు.(చదవండి: ఏపీ అసెంబ్లీ: లైవ్ అప్‌డేట్స్)
ఆ దిక్కుమాలిన గ్రంథం మా దగ్గర లేదు: మంత్రి అనిల్
మంత్రులు మాట్లాడుతుంటే వెల్‌లోకి వచ్చి గొడవ చేసిన టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సెల్ మెసేజ్ పంపడం, మరికొంత మంది మొబైల్ ఆపరేట్ చేస్తూ బయటికి మెసేజ్‌లు ఇవ్వడం పట్ల మండిపడ్డారు. ‘‘గతంలో కూడా ఇలానే ఫోటోలు వీడియోలు పంపారు. దయచేసి సభ్యుల సెల్‌ఫోన్లు బయటే ఉంచేలా అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి’’ అని అనిల్ అన్నారు. ఇక ప్రభుత్వంపై టీడీపీ విమర్శలను తిప్పికొడుతూ.. ‘‘మీరు రాసుకున్న మనసులో మాట అనే దిక్కుమాలిన గ్రంథం మా దగ్గర లేదు. టీడీపీ వాళ్లు ఆ మహా గ్రంథాన్ని తీసుకు వస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏం రాశారన్నది ఉంటుంది’’ అంటూ ఎద్దేవా చేశారు.(చదవండి: ‘ఏమనాలి వీణ్ణి .. ఇంగిత జ్ఞానం ఉందా?’)