సాక్షి, అమరావతి: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని ముందు డిమాండ్ చేస్తే.. ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో కింగ్ మేకర్‌గా ఉన్న బాబు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా అని నిలదీశారు.
15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగిన రోజులు గుర్తులేదా అని మండిపడ్డారు షర్మిల. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పిన బాబే.. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మోసం చేసిన ప్రధాని మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై బాబు వైఖరి ఏంటో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని చంద్రబాబును ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment