ఆంధ్రప్రదేశ్ లో అప్పులకు సంబంధించి పార్లమెంటులో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లెక్కల ప్రకారం తెలుగుదేశం హయాంలోనే అధిక అప్పులు చేశారని తేలింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో 1.77 లక్షల కోట్ల అప్పు చేస్తే, టిడిపి హయాంలో 2.64 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ఆమె తెలిపారు.
దీంతో ఇంతకాలం ఎప్పుడు వీలైతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై రుణాలు అంటూ విష ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియాలకు తలతిరిగింది. దాంతో ఎల్లో మీడియా ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టడం కోసం మద్యం పై అప్పులు చేశారని అంటూ మరుసటి రోజే బానర్ కధనాలు రాసి ఆత్మ వంచన చేసుకున్నారు.
క్రానికల్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఆయుధంగా మారింది. తమ హయాంలో కన్నా టిడిపి ప్రభుత్వమే ఇష్టారీతిన అప్పులు చేసిందని వైఎస్ఆర్‌సీపీ విమర్శించడానికి ఆస్కారం ఏర్పడింది.
టిడిపి హయాంలో అప్పులు 2.64 లక్షల కోట్లు అయితే, ఆ రుణాలు ఈ ప్రభుత్వ టైమ్ లో 4.42 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే దాని అర్ధం టిడిపి ప్రభుత్వమే అధికంగా అప్పులు చేసిందని గణాంకాలతో వెల్లడైంది. ఇంతకాలం ఎపికి పది లక్షల కోట్ల అప్పు అంటూ దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి వాటికే కాకుండా కొద్ది రోజుల క్రితం అప్పులపై విమర్శలు చేసిన బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా కేంద్రం సమాధానం ఇచ్చినట్లయింది.
(చదవండి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మంత్రి రోజా సెటైర్లు)
ఆర్థిక మంత్రి చెప్పాక కూడా మరో తప్పుడు స్టోరీ
నిర్మలా సీతారామన్ సమాధానంతో వైఎస్ఆర్‌సీపీ పని సులువు అయింది. ప్రతిపక్షం, ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై బురద వేస్తోందని గట్టిగా చెప్పగలుగుతోంది. అంతేకాదు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా తీసుకున్న అప్పుల గురించి కూడా నిర్మలా సీతారామన్ వివరించారు.
వాటిని చూసినా అవేమీ భారీగా లేవని అర్ధం అవుతుంది. ఇవన్ని కలిపితే మరో నలభై వేల కోట్ల వరకు ఆమె వివరాలు ఇచ్చారు. దీంతో తాము ఇంతకాలం రాసిందంతా అసత్యమని ప్రజలకు తెలిసిపోయిందని కంగారు పడ్డ ఎల్లో మీడియా వెంటనే మరో స్టోరీని వండేసింది.
ఈనాడు పత్రిక అయితే ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఏభైవేల కోట్ల రుణం అని అడ్డగోలు వార్త రాసింది. ఇందులో ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టేదేమి ఉంటుంది. మద్యం అమ్మకాలు లేకపోతే అది వేరే విషయం. గత టిడిపి ప్రభుత్వం ఇంటింటికి బెల్టు షాపుల ద్వారా మద్యం సరఫరా చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అంతా అద్భుతంగా ఉందని ఈనాడు భావన.
అదే జగన్ ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించి , పన్నులు పెంచి, మద్య సేవన అలవాటు తగ్గించడానికి యత్నిస్తుంటే అది ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమని ఈనాడు ప్రచారం చేస్తోంది. పాదయాత్రలో వైఎస్ జగన్ ఏదో చెప్పారని రాస్తూ, మద్యపానంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నా అప్పులు తీసుకోవడమే ముఖ్యమన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈనాడు వ్యాఖ్యానించింది.
మరి మద్యం అమ్మడమెందుకు?
మద్యపానం వల్ల అన్ని నష్టాలు ఉన్నాయని గుర్తించబట్టే జగన్ బెల్టు షాపులు లేకుండా చేశారు. ప్రభుత్వమే మద్యం రిటైల్ షాపులు నిర్వహించి, తక్కువ వ్యవధిలో అందుబాటులో ఉండేలా చేశారు. మద్య నిషేధంపై ఉద్యమం చేసిన ఇదే ఈనాడు పత్రిక చంద్రబాబు మద్య నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు ఏమి రాసింది.
అసలు వీరికి చిత్తశుద్ది ఉందా? ఉంటే వారు నడిపే హోటళ్లలో, ఫిల్మ్ సిటీలలో మద్యం ఎందుకు విక్రయిస్తున్నారు? చెప్పేటందుకే నీతులు అన్నట్లు రామోజీరావు వ్యవహరిస్తున్నారని పదే, పదే బట్టబయలు అవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి కోరిక ఏమిటంటే ఏ రూపంలోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్దిక వనరులు సమకూరకూడదన్నదే.
రాష్ట్రం నాశనం అవ్వాలన్నది వారి దురుద్దేశం. మద్యాన్ని ఎత్తివేస్తే, అప్పుడు అక్రమ రవాణా అంటూ వార్తలు రాయవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతే ఆయా సంక్షేమ పథకాలకు నిధుల సమస్య రావాలన్నది వారి దురుద్దేశం.
(చదవండి: టీడీపీ నేత జయసుబ్బారెడ్డిపై కేసు నమోదు)
కనీసం జగన్ ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాలలోకి వివిధ సంక్షేమ స్కీముల డబ్బులను జమచేస్తోంది. దాని వల్ల అవినీతి లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం అయినా శక్తికి మించి అప్పులు చేయవద్దని వార్తలు ఇవ్వడం తప్పు కాదు. కాని జగన్ ప్రభుత్వంపై బురద వేసే లక్ష్యంతో వార్తలు ఇవ్వడం వల్లే సమస్యలు వస్తున్నాయి.
అప్పుడు గొప్ప.. ఇప్పుడు ఘోరం
చంద్రబాబు టైమ్ లో చేసిన లక్షల కోట్ల అప్పులతో ఏమి చేశారో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్కసారైనా రాశాయా? పైగా అమరావతిలో బాండ్లు విడుదల చేస్తే ఏడువేల కోట్ల రూపాయల రుణం వచ్చిందని, అదంతా చంద్రబాబు ముఖం చూసే బాండ్లు కొన్నారని ఇవే మీడియా ప్రచారం చేసింది.
అంటే అప్పుడు అప్పులు చేస్తే గొప్ప, ఇప్పుడు అప్పులు చేస్తే ఘోరం అని చెబుతున్నాయి. ఇంత దుర్మార్గంగా మీడియా ప్రవర్తించడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం. మరి మోదీ ప్రభుత్వం కోటిన్నర లక్షల కోట్ల వరకు దేశం అప్పును తీసుకువెళ్లింది.
మరి వాటి గురించి రాయడానికి వీరు ఎందుకు భయపడుతున్నారు. తెలంగాణ అప్పుల గురించి నోరెత్తితే ఒట్టు. అది రామోజీ మార్కు జర్నలిజంగా మారింది. చంద్రబాబు టైమ్ లో ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు ఇచ్చి ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయా కార్పొరేషన్ ల ద్వారా అప్పులు చేసినా వీరంతా ఆహా.. ఓహో అన్నారే కాని, ఎందుకు ఇలా చేస్తున్నావని అక్షరం ముక్క రాయలేదు.
ప్రతిపక్షాలు రాజకీయాలు చేశాయంటే అర్ధం చేసుకోవచ్చు. కాని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి రాజకీయ రాబందుల్లా మారి ఎపి ప్రజలను పీక్కు తినాలని చూస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment