జూన్ 4 ఏపీ జడ్జిమెంట్ డే
ఉదయం 8గం. కౌంటింగ్ ప్రారంభం
సీఎం జగన్ పులివెందుల, చంద్రబాబు కుప్పం ఫలితాల కోసం సాయంత్రం దాకా ఆగాల్సిందే!
పవన్ పోటీ చేసిన పిఠాపురం ఫలితం మాత్రం మధ్యాహ్నానికే!
గోదావరి జిల్లాల నుంచే మొదటి ఫలితం.. మధ్యాహ్నానికి ఫలితం ప్రకటన
13 రౌండ్లకే కౌంటింగ్ ముగియనున్న నరసాపురం, కొవ్వూరు స్థానాలు
ఈ రెండింటిలో ఒకదాని నుంచే తొలి ఫలితం
ఆచంట, పాలకొల్లు 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, మచిలీపట్నం, బాపట్ల నియోజకవర్గాలు 15 రౌండ్లలో
తొలి మూడు గంటల్లోనే దాదాపు గోదావరి జిల్లాలలోని ఎనిమిది నియోజకవర్గ ఫలితాలు
ఏపీలో 29 రౌండ్లతో రంపచోడవరం, చంద్రగిరి ఫలితాలు ఆలస్యం
భీమిలి, పాణ్యం నియోజకవర్గాలలోనూ 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు.. ఫలితాలు రాత్రికే!
ఆంధ్రప్రదేశ్‌కి జూన్ 4వ తేదీ అంత్యంత కీలకం. ప్రజా తీర్పు వెలువడే రోజు అది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించింది. కౌంటింగ్ ప్రక్రియ సరళి ఎలా ఉండనుందో ఒక స్పష్టత కూడా ఇచ్చింది. అయితే ప్రధాన పార్టీల గెలుపొటముల మీదే కాదు.. మూడు ప్రధాన పార్టీల అధినేతలకు ఎలాంటి ఫలితాలు దక్కనున్నాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కౌంటింగ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్‌బ్యాలెట్ కౌంటింగ్ ముగిశాకే.. ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. ఒక్కొక్క రౌండ్ కి 14 టేబుల్స్ ఉంటాయి. ఈవీఎం కౌంటింగ్ పూర్తయ్యాక.. ఓటర్ స్లిప్(మొరాయించిన ఈవీఎంలలోని స్లిప్‌లను) ఆఖరిగా లెక్కిస్తారు. ఆ తర్వాతే ఫలితాన్ని ప్రకటిస్తారు. మరి ఫస్ట్ ఫలితం ఎక్కడి నుంచి రానుందంటే..
175 స్థానాలకు పోటీ పడ్డ అభ్యర్థుల్లో కొందరి భవితవ్యం కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటలకే తెలిసిపోతుంది. కానీ, కొన్ని చోట్ల మాత్రం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే.. ఏపీ ఎన్నికల తొలి ఫలితం గోదావరి జిల్లాల నుంచే వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంగానీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంగానీ తొలి ఫలితం అందించనుంది. కారణం ఆ రెండు చోట్ల కేవలం 13 రౌండ్లలోనే ఫలితం వచ్చేస్తుంది కాబట్టి. ఈ రెండు సెగ్మెంట్‌లలో నరసాపురంలో 1,43,825 ఓట్లు, కొవ్వూరులో 1,58,176 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాబట్టి.. మధ్యాహ్నాం లోపే ఈ రెండు నియోజకవర్గ తుది ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.
నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలు కూడా ఇంచుమించుగా త్వరగానే ఫలితాలు వచ్చేయొచ్చు. ఈ రెండు నియోజకవర్గాలలో 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆచంటలో 1,49,048 ఓట్లు, పాలకొల్లులో 1,60,489 ఓట్లు పోలయ్యాయి.
👉ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం కోసం సాయంత్రం దాకా ఆగాల్సిందే. ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాబట్టి, టైం పడుతుంది. పులివెందులలో ఈ ఎన్నికలకుగానూ 1,86,833 ఓట్లు పోలయ్యాయి. పురుషులు 91,484 మంది ఓట్లు వేస్తే 95,339 మంది మహిళలు ఓట్లు వేసారు. గత రెండు ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైఎస్ జగన్‌ను పులివెందుల ప్రజలు గెలిపించారు. 2014లో 75,243 వేల మెజారిటీ, 2019లో 90,110 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు.
👉టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గ ఫలితం మరోలా రాబోతోందా? అనే చర్చ ఏపీ రాజకీయ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది. అయితే కుప్పంలో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. ఇక్కడ 2,02,920 ఓట్ల పోలవ్వడంతో సాయంత్రంలోపు ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. కుప్పంలో చంద్రబాబు వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. కుప్పాన్ని తన ఇలాకాగా ప్రకటించుకున్న ఆయన.. 2014 ఎన్నికల్లో 47 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. 20189 ఎన్నికల నాటికి ఆ మెజారిటీ 30వేలకు పడిపోయింది.
👉పిఠాపురంలో 2,04,811 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక్కడ ఫలితాలు దాదాపుగా మద్యాహ్నం 2 గంటల తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో ఈ స్థానం గురించి ప్రత్యేక చర్చ నడుస్తోంది.
గోదావరి జిల్లాల నుంచే మరికొన్ని నియోజకవర్గాల ఫలితాలు త్వరగా వెల్లడి కానున్నాయి. పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఫలితాలు కూడా త్వరగానే వెలువడే ఛాన్స్ ఉంది. ఈ నాలుగు చోట్ల 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక పోలవరం మినహా మిగిలిన 15 నియోజకవర్గాలు కూడా 20 రౌండ్ల లోపు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తంగా.. గోదావరి జిల్లాల తుది ఫలితాలపై మధ్యాహ్నానికి స్పష్టత రానుంది.
👉కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం ఫలితాలు కూడా త్వరగానే రాబోతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో కూడా 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
👉అయితే.. అన్నింటికంటే చిట్టచివరగా అల్లూరి జిల్లా రంపచోడవరం , తిరుపతి చంద్రగిరి ఫలితాలు రాబోతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో దాదాపు 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో పూర్తి స్ధాయి ఫలితాలు రావడానికి రాత్రి సమయం పట్టే అవకాశం ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో 2,08,025 ఓట్లు పోలవ్వగా...చంద్రగిరి నియోజకవర్గంలో 2,51,788 ఓట్లు పోలయ్యాయి.
అలాగే నంద్యాల/కర్నూలు పాణ్యం, విశాఖ భీమిలి నియోజకవర్గాలలో కూడా ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశాలే ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలలో కూడా 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలో 2,75,747 ఓట్లు పోలయ్యాయి. పాణ్యం నియోజకవర్గంలో 2,46,935 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు నియోజకవర్గాలలో లెక్కించాల్సిన ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో ఫలితాలు చిట్టచివరినే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
👉.. మొత్తంగా 175 నియోజకవర్గాలకు గాను అత్యధికంగా 111 నియోజకవర్గాలలో 20 కంటే తక్కువ రౌండ్ల లోనే లెక్కింపు చేయబోతున్నారు. ఆ కౌంటింగ్ మధ్యాహ్నాం 2గం. లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా, ఆయా జిల్లాల కలెక్టర్లని ఆదేశించారు.
👉మరో 60 నియోజకవర్గాలలో 21 నుంచి 24 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగబోతొంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోపు ప్రకటించొచ్చు.
👉ముందుగా ఫలితాలను సువిధ యాప్ లో అప్ లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
అలాగే ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి, 21-ఈ ను అదే రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారులు పంపించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment