
అమరావతి, సాక్షి: శాసన మండలిలో ఇవాళ ఏపీ మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో.. రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారని అన్నారామె.
జగన్‌మోహన్‌రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు..
మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శాంతిచకపోవడంతో మండలిని వాయిదా వేశారాయన. ఇదిలా ఉంటే.. నిన్న ఇదే మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సమయంలో హజ్ యాత్రను ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి.
