సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తమ ప్రభుత్వంలోని ఒక మంత్రిని అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలవేళ కేంద్ర ఏజెన్సీలు యాక్టివ్‌గా మారుతున్నాయని తెలిపారు. ఎవరినైనా ఏజెన్సీలతో దాడులు చేయించగలరని, కానీ తాము ఎవ్వరికీ భయపడమని అన్నారు. కేంద్ర సంస్థ ఈడీ తమ ప్రభుత్వంలోని ఆరోగ్యశాఖమంత్రి సత్యేందర్ జైన్‌ను ఆర్థిక నేరాల పేరుతో అరెస్ట్ చేయాలని యోచిస్తునట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు.
జైన్ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో ఉన్నారని తెలిపారు. దాడులకు భయపడి తాము వెనకడుగు వెయ్యమని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘పంజాబ్ ఎన్నికలకంటే ముందే రాష్ట్ర మంత్రి సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని సమాచారం ఉంది. వారికి స్వాగతం పలుకుతాం. గతంలో కూడా ఆయనపై కేంద్ర ప్రభుత్వం దాడులు జరిపించింది. కానీ, ఆయన వద్ద ఏం లభించలేదు’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తే కేంద్ర సంస్థల ద్వారా ప్రతిపక్షాలపై దాడి చేయిస్తుందని మండిపడ్డారు. ఎన్నికలు వస్తే బీజేపీ.. దాడులు, అరెస్ట్‌లు చేయిస్తుందని, వాటికి తాము భయపడమని తెలిపారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీలా తాము గందరగోళానికి గురికామని చెప్పారు. తాము ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment