సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పని చేస్తున్నారంటూ రాహుల్ చేసిన ఆరోపణలపై ఒవైసీ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. కేవలం మతపరమైన విద్వేషం కారణంగానే రాహుల్ గాంధీ తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఒవైసీ అంటున్నారు.
గురువారం సాయంత్రం సంగారెడ్డిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించారు. ‘కర్ణాటక ఎన్నికల సమయంలో ఢిల్లీలోని నా ఇంటికి రాహుల్ ఒకరిని పంపారు. ఆ రహస్యం ఏంటో చెప్పమంటారా?.. నేనూ మీ గురించి చాలా చెప్పగలుగుతా’ అంటూ రాహుల్‌ను ఉద్దేశించి ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అమేథీలో ఓడిపోవడానికి బీజేపీ దగ్గరి నుంచి ఎంత తీసుకున్నారు. మీ స్నేహితులు సింధియా, జితిన్ ప్రసాదలు బీజేపీలో చేరారు. కానీ, వాళ్లెవరిపైనా డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు మీరు చెయ్యరు. ఎందుకంటే.. మీకు(రాహుల్) మేమంటే ద్వేషం’’ అని ఒవైసీ ప్రసంగించారు.
కావాలనే రాహుల్ నాపై ఆరోపణలు చేస్తున్నారు. నా పేరు అసదుద్దీన్ కాబట్టే రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. నెత్తిన టోపీ, గడ్డం ఉంది కాబట్టే ఈ ఆరోపణలు చేశారు. కానీ, రాహుల్‌కు మా బలమేంటో తెలియదు. మా బలమేంటో గుర్తించే ఇందిరా గాంధీకి దారుస్సలాంకు వచ్చారు. రాహుల్.. ఈ గడ్డం టోపీదారులే రాహుల్‌కు త్వరలో బుద్ది చెప్తారు అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ‘‘మీ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడితే.. మీరు ఎందుకు నోరు మెదపరు. ఎంపీప్రభాకర్‌పై మీ కార్యకర్త దాడి చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు?. దమ్ముంటే నాపై బరిలోకి దిగు.. తాడోపేడో తేల్చుకుందాం అని రాహుల్‌కు ఒవైసీ సవాల్ విసిరారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా.. బుధవారం ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ‘‘పలు రాష్ట్రాల్లో బీజేపీ నుంచి డబ్బు తీసుకుని.. కాంగ్రెస్‌పై అభ్యర్థులను నిలబెడుతోంద’’ని ఎంఐఎంపై ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment