
న్యూఢిల్లీ: బీజేపీ తొలి జాబితాలో పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ సెగ్మెంట్ అభ్యర్థిగా ప్రకటించబడిన భోజ్‌పూరి నటుడు, గాయకుడు పవన్ కుమార్ సింగ్ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ‘నాపై బీజేపీ అధినాయకత్వం పూర్తి నమ్మకంతో నాకు అసన్‌సోల్ నియోజకవర్గం సీటు కేటాయించింది. కానీ, నేను పోటీ చేయలేను. కొన్ని కారణాల వల్ల నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’ అని పవన్ కుమార్ సింగ్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా ప్రకటించారు.
भारतीय जनता पार्टी के शीर्ष नेतृत्व को दिल से आभार प्रकट करता हु।
— Pawan Singh (@PawanSingh909) March 3, 2024
पार्टी ने मुझ पर विश्वास करके आसनसोल का उम्मीदवार घोषित किया लेकिन किसी कारण वश में आसनसोल से चुनाव नहीं लड़ पाऊंगा…@JPNadda
బిహార్‌కు చెందిన పవన్ కుమార్ సింగ్‌ను బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీకి దించటంపై పెద్ద ఎత్తున దుమారం రేపింది. బెంగాలీ మహిళలపై అభ్యంతరకరమైన పాటలను రూపొందించినట్లు ఆయనపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో పవన్‌కుమార్ అభ్యర్థిత్వం వల్ల అసన్‌సోల్ నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని బీజేపీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అంతలోనే పవన్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించటం గమనార్హం.
బీజేపీ తొలి జాబితాలోనే పశ్చిమ బెంగాల్‌లో 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన 20 మందిలో అసన్‌సోల్ సెగ్మెంట్ నుంచి పవన్ కుమార్ సింగ్‌కు అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇలా.. పోటీ నుంచి పవన్ కుమార్ వైదొలుగుతున్నట్లు ప్రకటించటంపై బెంగాల్ బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు.