సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో పెద్ద జిల్లాల్లో ఒకటైన ఆగ్రాలో ఆధిపత్యం సాధించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. జాటవ్, బ్రాహ్మణ, ఠాకూర్, జాట్, ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలోని 9 నియోజకవర్గాలను మరోమారు క్లీన్‌స్వీప్ చేసేందుకు అధికార బీజేపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుండగా, 30 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఒకేఒక్కసారి ఒకేఒక్క సీటును గెలుచుకున్న ఎస్పీ ఈ మారు చరిత్ర తిరిగిరాసే యత్నాల్లో మునిగింది.
యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న ఆగ్రాలో ఆగ్రా కాంట్, ఆగ్రా నార్త్, ఆగ్రా రూరల్, ఆగ్రా సౌత్, బాహ్,ఎత్మాద్‌పూర్,ఫతేహాబాద్, ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్ నియోజకవర్గాలున్నాయి. బాహ్ పరిధిలో బ్రాహ్మణ ఓటర్లు అధికంగా ఉండగా, రెండో స్థానంలో ఠాకూర్‌లు ఉన్నారు. ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్, ఎత్మాద్‌పూర్‌లో బ్రాహ్మణ, ఠాకూర్‌ల ఆధిపత్యం ఉన్నప్పటికీ మల్లాలు,కుష్వాహా, జాటవ్, వాల్మీకిలు గణనీయ సంఖ్యలో ఉన్నారు.
తొలినుంచీ బీఎస్పీదే ఆధిపత్యం...
జిల్లాలో ఏకంగా 21శాతం మంది ఎస్సీ కులాలకు చెందిన వారే కావడం, ఇక్కడి పాదరక్షల పరిశ్రమల్లో పని చేసే వారంతా బీఎస్పీ అధినేత్రి మాయావతి కులానికి చెందిన జాటవ్‌లే కావడం, దళిత–బ్రాహ్మణ ఫార్ములా విజయవంతం కావడంతో ఇక్కడ బీఎస్పీ హవా తొలినుంచీ ఉంది. 2007లో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో ఆగ్రాల్లో 6 స్థానాలను గెలుచుకోగా, 2012లో ఓటమి పాలైనప్పటికీ జిల్లాలో సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 6 స్థానాలతో బీఎస్పీ తొలి స్థానంలో కొనసాగింది. ప్రస్తుత ఎన్నికల్లో ఇంతవరకు బహిరంగ సభలు, ర్యాలీలకు దూరంగా ఉన్న మాయావతి ఫిబ్రవరి 2న ఆగ్రా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధ మయ్యారు. తన ఆధిపత్యాన్ని నిలుపుకునేలా ఇప్పటికే టికెట్ల కేటాయింపు చేసిన మాయావతి ఆగ్రా నుంచి తాడోపేడో తేల్చుకోనున్నారు.
పట్టు నిలుపుకునేలా బీజేపీ వ్యూహాలు..
2012లో కేవలం రెండు స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2017 నాటికి బలంగా పుంజుకుంది. ఏకంగా జిల్లాలో 55 శాతం ఓట్లను దండుకున్న బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. జాటవ్‌ల ఓట్లలో చీలిక, హిందూత్వ నినాదం బలంగా పనిచేయడం, వాల్మీకి వర్గం అంతా బీజేపీకి అండగా నిలవడంతో బీజేపీ సునాయాసంగా గట్టెక్కింది. ఈ సారి అదేస్థాయి విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ జాటవ్ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీరాణి మౌర్యని రంగంలోకి దింపారు. ఆయనకు ఆగ్రా రూరల్ సీటు కేటాయించారు. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది.
30ఏళ్లలో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న ఎస్పీ
ఇక ఆగ్రా జిల్లాలో సమాజ్‌వాదీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 1992లో పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో కేవలం ఒకే ఒక్క సారి, ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే విజయం సాధించడం ఇక్కడ ఎస్పీ పరిస్థితికి అద్దం పడుతోంది. 2012లో ఒక్కసారి మాత్రమే బాహ్ నియోజకవర్గం నుంచి రాజా అరిదమన్‌సింగ్ గెలిచారు. 2017 ఎన్నికల్లో ఒక్కసీటు గెలువని ఎస్పీ కొన్ని చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచింది. ఇక 1996లో చివరిసారిగా ఒక ఎమ్మెల్యే స్థానంలో గెలిచిన కాంగ్రెస్ ఆ తర్వాత నుంచి జిల్లాల్లో పత్తా లేకుండా పోయింది. 1996లో ఖేరాఘర్‌లో కాంగ్రెస్ తరఫున మండలేశ్వర్‌సింగ్ గెలిచాక ఆ పార్టీ జిల్లాలో ఖాతా తెరవలేదు. గడిచిన 2012, 2017 ఎన్నికల్లో పార్టీ కేవలం జిల్లాలో 6 నుంచి 7 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment