నిజమే! సామన్యులు ఇప్పడు గళం విప్పడమే గగనమైపోతోంది. పాలకులను పల్లెత్తు మాటన్నామా నిర్బంధమే. మరి ఇప్పుడెలా? రాజ్యం ప్రజలపై బలవంతంగా మోపే బలవంతపు ఫర్మానాలను ప్రశ్నించేవారే లేరా? ఎందుకు లేరు ఉన్నారు? సదాఫ్ జాఫర్, పూజా శుక్లా లాంటి సామాన్య మహిళలు ప్రభుత్వ నిరంకుశ ధోరణులను నిర్భయంగా నిలదీశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం కారాగార వాసం చేయాల్సి వచ్చినా జంకలేదు, జావగారిపోలేదు! ఆ ధైర్యమే వారికి ఇప్పుడు శాసనకర్తలయ్యే అవకాశాన్ని కల్పించింది.
భారతావనిలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు హాట్‌టాఫిక్. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తాయనేది సర్వత్రా ఆసక్తికరం. తలపండిన రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వందిమాగధులకు అవకాశాలే అధికమన్నది కళ్లెదుటే కనబడుతున్న చరిత్ర. ఇంతటి పోటీలోనూ ఇద్దరు (అ)సామాన్య మహిళలు పెద్ద పార్టీల టిక్కెట్లు దక్కించుకోవడం వర్తమాన రాజకీయాల్లో అరుదైన దృశ్యం. ఇంతకీ ఎవరా ఇద్దరు..?
సదాఫ్.. శభాష్!
ప్రతిష్టాత్మక లక్నో సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశాన్ని నటి, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ దక్కించుకున్నారు. ఆషామాషీగా ఆమెకు ఈ అవకాశం రాలేదు. కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 2019, డిసెంబర్‌లో గళమెత్తినందుకు మదమెక్కిన మగ పోలీసు దురహంకారంతో కాలితో ఆమె పొట్టలో తన్నాడు. లక్నోలోని పరివర్తన్ చౌక్ వద్ద ఫేస్‌బుక్ లైవ్ సెషన్ నిర్వహించిన సదాఫ్‌ను అవమానవీయ రీతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు, హత్యాయత్నం కేసు పెట్టి ఆమెను జైల్లో పెట్టారు. అంతేకాదు ఆమె ఫోటోలతో పోస్టర్లు వేసి అవమానానికి గురిచేశారు.
సదాఫ్ పోరాటం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆమెను విడుదల చేయాలని యూపీ బీజేపీ సర్కారును డిమాండ్ చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2020, జనవరిలో సదాఫ్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్‌తో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. తలపండిన అధికార పార్టీ నాయకుడిని ఢీ కొట్టడానికి భయం లేదా అని అడిగితే.. ‘ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మొదటిసారి పోటీకి దిగినప్పుడు అనామకుడే కదా’అని బదులిచ్చారు సదాఫ్. ప్రజాస్వామ్య ఎన్నికల్లో అసలు బలం ప్రజలదేనని, తమకు పాలకులుగా ఎవరు ఉండాలో వారే నిర్ణయించుకుంటారని చెప్పారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?)
నల్లజెండా తెచ్చిన అవకాశం
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు నల్లజెండాలతో నిరసన తెలిపి ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి దూసుకొచ్చారు పూజా శుక్లా. లక్నో నార్త్ నియోజక వర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారామె. 25 ఏళ్ల పూజా శుక్లా.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కులైన అభ్యర్థుల్లో ఒకరు. 2017, జూన్ 7వ తేదీ ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్. హిందీ స్వరాజ్ దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్నో యూనివర్సిటీ క్యాంపస్‌కు వెళుతున్న సీఎం యోగికి నల్లజెండాలతో నిరసన తెలపడంతో పూజా శుక్లాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
20 రోజుల తర్వాత బయటికి వచ్చిన ఆమె సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. ఆమె పోరాటానికి ముగ్దుడైన పెద్దాయన పార్టీ విద్యార్థి విభాగం అయిన ‘సమాజ్‌వాదీ చత్ర సభ’లో శుక్లాకు ప్రముఖ స్థానం కల్పించారు. అయితే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపి తనతో పాటు జైలుకెళ్లొచ్చిన వారికి లక్నో యూనివర్శిటీ 2018లో ప్రవేశం నిరాకరించడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి విశ్వవిద్యాలయ పాలకవర్గాన్ని దిగొచ్చేలా చేశారు. (క్లిక్: ప్రభుత్వాలనే కూల్చిన పంచ్ డైలాగులు)
ఈ పరిస్థితి మారాలి
నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లక్నోలోని క్లాక్‌టవర్ వద్ద 2020, జనవరిలో మహిళలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలోనూ శుక్లా కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ‘విద్య పేరుతో యువతను, ముఖ్యంగా విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి. రాజకీయంగా అవగాహన ఉన్న విద్యార్థి మాత్రమే మంచి నాయకుడిని ఎన్నుకోగలడు. దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసి, ప్రగతిపథంలో తీసుకెళ్లే సత్తా యువతకు ఉంద’ని శుక్లా అన్నారు. రాజకీయ నాయకురాలిగా కూడా యువత, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టంచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్నో నార్త్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నీరజ్ బోరాతో పూజా శుక్లా హోరాహోరీ తలపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను యువత, స్థానికుల అండదండలతో విజయం సాధిస్తానని దీమాగా చెబుతున్నారామె.
పోరాట నేపథ్యం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సదాఫ్ జాఫర్, పూజా శుక్లాలను యూపీ ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారనేది పక్కన పెడితే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి హక్కుల కోసం నిర్భయంగా నినదించిన వీరిద్దరి పోరు పంథా సామాన్యులకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు! (చదవండి: ఇలా పార్టీ ఫిరాయించి టికెట్ తెచ్చుకున్నారు!)
Comments
Please login to add a commentAdd a comment