సాక్షి, విశాఖపట్నం: పార్టీ లేదు.. బొక్కా లేదు.. అని తిరుపతిలో టిఫిన్ తింటూ తాపీగా చెప్పిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు.. విశాఖలో మరో బాంబ్ పేల్చారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు సోదంతా చెబుతారని అసలు గుట్టు విప్పారు. అంతేగాకుండా ఆయన మాటలపై కార్యకర్తలకే కాదు.. మాకూ నమ్మకం లేదంటూ కుండబద్దలు కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల మాటే వింటారని విమర్శించారు. టీఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ తెలుగునాడు విద్యుత్ కార్మికసంఘం ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్‌లను విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు ఆ పార్టీలో మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘మేము కూడా కొన్ని తప్పులు చేశాం.. ఒప్పుకోవాలి. అన్ని చేశాం కానీ మిమ్మల్ని దగ్గర చేసుకోవడంలో వైఫల్యం చెందాం. నేను గర్వంగా చెబుతున్నాను. మాలో ఆ చాకచక్యం లేదు. మీరు మాతోనే ఉన్నారని అనుకున్నాం. మాకే మద్దతు ఇస్తారని అనుకున్నాం. ఇబ్బడిముబ్బడిగా హామీలిస్తే ఉద్యోగస్తులు షర్టులు విప్పి ఎగిరెగిరి ఫ్యాన్‌కు ఓటువేశారు. మేం ఎంతచెప్పినా వినలేదు..’ అని వాపోయారు.
చదవండి: (17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు)
‘గతంలో మా సారు చాలా బిజీ అయిపోయారు.. కొత్తగా రాష్ట్రం వచ్చింది ఏదో చేద్దామని తాపత్రయపడ్డారు. ఆరునూరైనా.. ఎవరడ్డువచ్చినా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. కార్యకర్తల మాటకు విలువ ఇచ్చే విధంగా చేస్తాం. మీరనుకోవచ్చు. అధికారంలో లేనప్పుడు ఇలాగే మాట్లాడతారు. చంద్రబాబు.. తెలుగుదేశం ముఖ్య నాయకుడు అధికారం లేనప్పుడు సోదంతా చెబుతారు. అధికారం వచ్చిన తర్వాత మొత్తం మీకే సర్వం ఇస్తామని చెబుతారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడో ఉంటారు.. చంద్రబాబు అధికారుల మాటే వింటారని ఎవ్వరూ నమ్మడం లేదు.
చదవండి: (టీడీపీ చెత్త రాజకీయం.. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత)
కానీ ఈసారి చంద్రబాబు వినకపోయినా మేమందరం ఆయనకు నచ్చజెప్పి ప్రజాపరిపాలన తీసుకువస్తాం. కార్యకర్తల మాటకు విలువ ఇచ్చే విధంగా, కార్మికులకు న్యాయం జరిగే విధంగా దగ్గరుండి చేసే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీసుకుంటా..’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగంలో చంద్రబాబును ఏకవచనంతోనే సంబోధించటం గమనార్హం. అంతేకాకుండా చంద్ర బాబు కార్యకర్తలతో ఎలా వ్యవహరించాలో రాష్ట్ర అధ్యక్షుడిగా తానే గైడ్ చేస్తాననే రీతిలో ఆయన మాటలతీరు ఉండటం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment