
ఒంగోలు: చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరికీ ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్‌టీఆర్ స్థాపించిన పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినా.. ఎన్‌టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్ పేరు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టీఆర్ జాతీయ స్థాయి నాయకుడైతే జిల్లాకు ఎలా పేరు పెడతారంటూనే.. మరోవైపు అంబేడ్కర్ పేరుతో జిల్లా నామకరణం జరగాలని డిమాండ్ చేయడం దారుణమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత అని, అటువంటి నాయకుడి పేరును జిల్లాకు పెట్టాలంటూనే ఎన్‌టీఆర్ పేరును జిల్లా స్థాయిలో పెట్టడమేంటంటూ చంద్రబాబు ప్రశ్నించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. అంబేడ్కర్, ఎన్‌టీఆర్‌లలో ఎవరు గొప్పవారో విజులు గమనించాలని సూచించారు.
జిల్లాల విభజనకు 99 శాతం మద్దతు
జిల్లాల విభజన ప్రక్రియకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని, అయితే 99 శాతం మంది ప్రజలు హర్షిస్తున్నారని మంత్రి బాలినేని చెప్పారు. టీడీపీ నాయకులు మాత్రం దీనిపైనా రాజకీయం చేయడం, నాటకాలు ఆడడం, కుట్రలు పన్నడం చేస్తున్నారని, ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కోర్టుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. అయితే కందుకూరులో రెవెన్యూ డివిజన్ తొలగించడంతో పాటు.. ఆ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంపై ప్రజలు అసంతృప్తికి గురవుతున్న విషయాన్ని సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి చెప్పారు. సోము వీర్రాజు ఒక రోజు టీడీపీని, మరుసటి రోజు వైఎస్సార్‌సీపీని, ఇంకో రోజు సొంత పార్టీని సైతం విమర్శిస్తారని, అలాంటి వ్యక్తి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment