సాక్షి, అమరావతి: టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు సన్నిహితుడని అందుకే నిబంధనలు పక్కనపెట్టి ఫైబర్‌నెట్ ప్రాజెక్టు టెండర్లను దానికి కట్టబెట్టారని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ఫైబర్‌నెట్ టెండర్ల గోల్‌మాల్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ టెండర్లలో చాలా అవకతవకలు జరిగాయని, ఇతర కంపెనీల కంటే ఎక్కువకు కోట్ చేసినా ఆ సంస్థకే పనులు అప్పగించారని తెలిపారు.
అప్పటి సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే రూ.307 కోట్ల ఈ టెండర్ల ప్రక్రియ జరిగిందన్నారు. ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఎండీ హరికృష్ణప్రసాద్‌నే టెండర్ పత్రాల మదింపు కమిటీ సభ్యుడిగా నియమించారని తెలిపారు. టెండర్లు వేయడానికి ఒకరోజు ముందు ఈ కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని, అది కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అధికారి కాకుండా కిందిస్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేశారని చెప్పారు.
ఈ కంపెనీ సరఫరా చేసిన సెట్‌టాప్ బాక్సులు వంటి పరికరాల్లో 20% మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని, 80 % పనిచేయడంలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించామని, దర్యాప్తు వేగవంతంగా చేపట్టి దోషులను శిక్షిస్తామన్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దీనిపై మాట్లాడుతూ ఫైబర్‌గ్రిడ్ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయన్నారు. కంపెనీ ఏర్పాటు చేసి మూడేళ్లు నిండాలి, కనీసం రూ.350 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధనలు పాటించకుండా ఈ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌కు అప్పగించారని తెలిపారు.
ఇది అవినీతి గ్రిడ్
దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును అవినీతి గ్రిడ్‌గా మార్చారని విమర్శించారు. మార్కెట్‌లో రూ.2,200కు దొరికే సెట్‌టాప్ బాక్సుని రూ.4,400కి కొనుగోలు చేశారని తెలిపారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ఉన్న శాఖ చంద్రబాబు చేతిలో ఉంటే చినబాబు సంతకం పెట్టారని చెప్పారు. ఇలా ఎలా, ఎందుకు చేశారో బయటపెట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, అమ్మఒడి పథకానికి సంబంధించిన ప్రశ్నలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం బోధన కోసం టీచర్లకు మూడుదశల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కీ రీసోర్స్ పర్సన్స్‌కి మూడు వర్సిటీలకు చెందిన నిష్ణాతులైన ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించామన్నారు. వారిద్వారా జిల్లా, మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో ప్రొబేషన్ ఖరారు
జూన్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సచివాలయ ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల కొంతమంది సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులను తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాలను తమ హయాంలో ఇచ్చినట్లు టీడీపీ మాట్లాడుతోందని, ఆ ఉద్యోగాలను సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. వారి పట్ల ప్రభుత్వం బాధ్యతగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment