కోహెడ (హుస్నాబాద్)/ కరీంనగర్ టౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను బీఆర్‌ఎస్ మోసం చేస్తే, వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మలిదశ ప్రజాహిత యాత్రలో భాగంగా సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి కేంద్రంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చిందని, అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ ఇస్తున్న నిధుల పుణ్యమేనని అన్నారు. కాంగ్రెస్‌కి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ రూ.5 లక్షల కోట్ల అప్పు తెస్తేం మీరు 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు’అని కాంగ్రెస్‌ను విమ ర్శించారు.
‘వంద రోజుల్లోనే 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తానన్నారు, 75 రోజులు దాటిపోయా యి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు, మహిళలకు నెలనెలా రూ.2,500, ఆసరా పెన్షన్ రూ.4 వేలు ఇస్తానన్న హమీ ఎందుకు అమలు చేయడం లేదు’అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణలో 2 లక్షల 40 వేల ఇళ్లు మంజూరుచేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా మోసం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని అన్నారు.
రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను గెలుస్తాం
సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదని, ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్ష్యాలు, ఆధారాలతోనే కవితకు నోటీసులిచ్చారని, ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదన్నదే బీజేపీ విధానమని బండి అన్నారు. రెండోవిడత ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని అన్నారు. విజయ సంకల్పయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. బీజేపీ ఐదారు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతోందని, బీఆర్‌ఎస్‌తో పొత్తు అంటే చెప్పుతో కొట్టాలని తానే చెబుతున్నానని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment