చైతన్యపురి: విద్యార్ధుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించటం సిగ్గు చేటని, ఆడకూతురుపై దాడి చేసిన ఘటనలో ఏసీపీ సహా బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డితో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏబీవీపీ విభాగ్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఝన్సీని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోందని, చివరకు విద్యార్ధుల భవిష్యత్తు నాశనం అవుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రయివేటు వర్సిటీ హోదా రాకుండానే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అడ్మిషన్ల దందా చేస్తున్నాయని ఆరోపించారు. ఉన్నత విద్యామండలి వద్ద ధర్నాకు పిలుపునిస్తే ధర్నా కన్నా ముందే ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం అన్యాయమన్నారు. విద్యార్ధుల పక్షాన యుద్ధం చేస్తున్న వారికి అండగా ఉండాల్సింది పోయి దాడులు చేసి పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసుకుంటారా.? అని బండి ప్రశ్నించారు.
ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌కు చేస్తామన్నారు. పేపర్ లీకేజీతో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారని, వీటికి కారణమైన మంత్రి కేటీఆర్ లండన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని, లీకేజి నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి జల్సాలు చేస్తున్నారని బండి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ది ఫాల్త్, మూర్ఖ, రాక్షస ప్రభు త్వం అని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ తమ పార్టీ నాయకుడని, జాతీయ నాయకత్వాన్ని కల వటానికి ఢిల్లీ వెళితే తప్పేంటని ప్రశ్నించారు.
నెలరోజుల పాటు బీజేపీ ‘అభియాన్’ కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నెల పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో మహాజన సంపర్క్ అభియాన్ రాష్ట్ర కమిటీని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాటు చేశారు.
కమిటీకి కన్వీనర్‌గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, సభ్యులుగా పార్టీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, ఎన్విసుభాష్, కట్టా సుధాకర్, పి.పాపారావు, గుండగోని భరత్‌గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, ఎం.వెంకటరమణ నియమితులయ్యారు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 30 దాకా అన్ని జిల్లాలు, మండలాలు, శక్తికేంద్రాలు, పోలింగ్‌బూత్‌లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment