సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బీజేపీ చేపడుతున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం నుంచి మొదలవుతోంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి.. పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, ఇతర ముఖ్య నేతలు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారం భించనున్నారు. తొలిరోజు కళాబృందాలు, సాం స్కృతిక కార్యక్రమాల ద్వారా పాదయాత్ర లక్ష్యా లు, ఉద్దేశాలను వివరించనున్నారు. ఇందుకోసం కరీంనగర్ నుంచి డోలు వాయిద్యాలు, డప్పు నృత్యాలు, అశ్వదళాల ప్రదర్శన, యుద్ధసైనికుల అలంకారాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు 36 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది.
రోజుకు 10–15 కిలోమీటర్లు..
‘ప్రజా సంగ్రామ యాత్ర’లో భాగంగా బండి సంజయ్ రోజూ పది, పదిహేను కిలోమీటర్లు నడుస్తూ ప్రజలను కలవనున్నారు. ఒక్కో జిల్లాలో రెండు, మూడురోజులు యాత్ర సాగేలా.. రోజూ ఒకట్రెండు సభల్లో ప్రసంగాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర పొడవునా సంజయ్ వెంట 300 వరకు ఉంటారని.. వారికితోడుగా పాదయాత్ర కొనసాగుతున్న జిల్లాలకు చెందిన వెయ్యి మంది కార్యకర్తలు, అదనంగా ఎక్కడికక్కడ స్థానిక కార్యకర్తలు బృందం వెంట నడుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్రతీరోజు రెండువేల మందితో యాత్ర సాగేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించాయి. సంజయ్ వెంట ఉండే బృందం రోజూ రాత్రి గుడారాలు ఏర్పాటు చేసుకుని బసచేస్తుందని తెలిపాయి.
17న అమిత్‌షా.. ముగింపు రోజున నడ్డా..
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసే బహిరంగసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 2న యాత్ర ముగింపు కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని వెల్లడించాయి. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే.. పాదయాత్ర హుజూరాబాద్‌కు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
తొలిరోజు యాత్ర ఇదీ..
శనివారం ఉదయం 9.30 సమయంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. వేములవాడ రాజన్న ఆలయ వేద పండితుల ఆశీస్సులు తీసుకుని.. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. సమీపంలోనే ఏర్పాటు చేసిన సభలో ›‘ప్రజా సంగ్రామ యాత్ర’ సమర శంఖం పూరిస్తారు. తొలిరోజున భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మొదలయ్యే పాదయాత్ర.. మదీనా, బేగంబజార్‌ల మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజనం చేశాక నాంపల్లి మీదుగా అసెంబ్లీ వద్దకు చేరుతుంది.
గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. తర్వాత లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్ మీదుగా మెహిదీపట్నం చేరుకుని రాత్రి బస చేస్తారు. తొలిరోజు కార్యక్రమంలో ఎంపీలు అరవింద్, బాపురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, సీనియర్ నేతలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, మురళీధర్‌రావు, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment