కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజం
రుణమాఫీ కాక రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకే అవసరం ఉంది
సాక్షి, హైదరాబాద్ / సుల్తాన్‌బజార్: రుణమాఫీ సహా ఆరు గ్యారంటీల అమలు అంశాన్ని పక్క దోవ పట్టించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం విలీన డ్రామాలు మొదలు పె ట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకే అవసరం ఉంది తప్ప బీజేపీకి కాదని అన్నారు. అవుట్ డేటెడ్, అవినీతి పార్టీ అయిన బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవలసిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఆదివారం కోఠిలోని ది యంగ్‌మ్యాన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ భవనాన్ని ఆయన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ‘విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి.. వాటితో ప్రజలకేం సంబంధం?’అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్‌లో కేవలం రూ. 26 వేల కోట్లు కేటాయించారని, చివరకు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తారని సంజయ్ నిలదీశారు. కాగా, ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంపై కుట్రలు చేస్తున్నాయని వాటిని ప్రధాని మోదీ సమర్థంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.
గురుకుల ఉద్యోగాల్లో మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయండి
తెలంగాణ రెసిడెన్షియల్ విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment