పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: బండి సంజయ్
కరీంనగర్‌టౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం బీజేపీ కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను మొదట హైడ్రాకు సపోర్ట్ చేశానని, పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలు, విల్లాలు, ఫాంహౌస్‌లను కూలిస్తే సమరి్థంచానన్నారు.
కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులు, పేదల ఇళ్లను కూలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే అత్యధికంగా పార్టీ సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసేవారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రమంతా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ కనీసం ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అందుకే ప్రజలంతా ఆయనకు ‘నో ఎంట్రీ’బోర్డు పెట్టేశారని చెప్పారు. దేశం ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. వ్యక్తి లాస్ట్ అనే నినాదంతో పనిచేస్తున్న బీజేపీలో ప్రతిఒక్కరూ చేరాల్సిన అవసరముందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment