
రాష్ట్రంలో కాంగ్రెస్ మాట తప్పింది.. కేసీఆర్ పదేళ్లు ప్రజలను అరిగోస పెట్టిండు
ప్రశ్నిస్తే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు
మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై ఎంపీ బండి సంజయ్ ధ్వజం
కథలాపూర్ (వేములవాడ/వేములవాడ అర్బన్ ): వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గాంధీభవన్ వద్ద, కేసీఆర్ పదేళ్లు ప్రజలను అరిగోస పెట్టినందుకు మంత్రి పొన్నం తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సవాల్ విసిరారు.
శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో బండి సంజయ్ మాట్లాడారు. అంతకుముందు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రైతులను కలిసి వారు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు. ఇకనై నా కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మా టలు మానుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
పొన్నం దీక్ష ఎందుకోసమో చెప్పాలి
పొన్నం దీక్ష చేసేది కరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకా? లేక కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ. 12 వేల కోట్ల నిధులిచ్చినందుకా? లేదా కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేసినందుకా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థి కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు చెన్న మనేని వికాశ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment