సాక్షి, హైదరాబాద్: జాతీయ నాయకత్వం పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురు, శుక్రవారాల్లో ఆయన పలువురు పార్టీ నేతలను కలుసుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచారం, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై మాట్లాడనున్నట్టు తెలిసింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నిక సందర్భంగా ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపాలు, ఇతర లోటుపాట్లపై అధినాయకత్వం దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై మునుగోడు ఫలితాలు ప్రభావం చూపనున్నందున, ఈ మేరకు కచ్చితమైన చర్యలు సూచించనున్నట్టు సమాచారం.
నివేదికల ఆధారంగా కార్యాచరణ
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించున్నట్టు తెలుస్తోంది. పార్టీతో సంబంధం లేని స్వతంత్ర సంస్థలు, బృందాల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఈ నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా తెలంగాణలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను అధినాయకత్వం రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు ఏ మేరకు అమలౌతున్నాయి, పార్టీ ప్రచారం ప్రజలపై ప్రభావం చూపించేలా జరుగుతోందా అన్న అంశాలపై నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను ఢిల్లీకి రమ్మనమంటూ వర్తమానం పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment