సూర్యాపేట: సీఎం కేసీఆర్ చేతిలో పడి రాష్ట్రం మొత్తం నలిగిపోతోందని.. ధరణి పేరుతో రాష్ట్రంలో నడుస్తున్న అతిపెద్ద ల్యాండ్ మాఫియా కారణంగా రైతులు భూములు కోల్పోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు. పీపుల్స్‌మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ధరణి మాఫియా సూత్రధారి సోమేశ్‌కుమార్, పాత్రధారి కేసీఆర్ అని ఆరోపించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు అడిగానని, అయితే వారు స్పష్టమైన సమాధానాలు చెప్పడం లేదని అన్నారు.
‘మీరు నడిచే రోడ్డు.. పీల్చే గాలి మాదే’ అంటూ వంకర మాటలు మాట్లాడుతున్నారని భట్టి దుయ్యబట్టారు. మరి సూర్యాపేటకు వచ్చే నీళ్లు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. ‘నీళ్ల పండుగ పేరుతో ఎస్సారెస్పీ కాల్వల వద్ద మీరు చల్లుకునేవి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి వైఎస్సార్ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తున్న నీళ్లో కాదో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమేనని.. అయితే అక్కడి నుంచి ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లిచ్చారా.. అన్నది చెప్పాలన్నారు.
‘మంత్రులు చల్లుకుంటున్న నీళ్లు కాంగ్రెస్ తెచ్చినవి. మీ కారు వస్తున్న రోడ్డు మేము వేసిందే. ఇక్కడ వెలిగే కరెంటు. వంద రోజుల పని, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ కార్డులు, సూర్యాపేటలో 5 వేల మంది పేదలకు ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్సే’అని భట్టి అన్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ మద్దతు తెలిపారు. యాత్రలో ఆయన భట్టిని కలిశారు. రానున్న 150 రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భూమిలేని పేదలకు ‘కూలీబంధు’: భట్టి
భానుపురి (సూర్యాపేట): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భూమిలేని పేదలకు ‘కూలీబంధు’పథకాన్ని ప్రవేశపెడతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం రాత్రి సూర్యాపేటలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద పేదలకు ఏటా రూ.12,500 అందజేస్తామని తెలిపారు.
తన పాదయాత్రలో రైతులు, రైతు కూలీల బాధలు విన్నానని, సింగరేణి బొగ్గుబాయిలో దిగితే కారి్మకుల గోస కనపడిందన్నారు. పేదలకు భూములను పంచడంతోపాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారి బతుకులను బాగు చేస్తుందన్నారు.జనాభాలో 50 %ఉన్న బీసీలకు సబ్‌ప్లాన్ తీసుకొస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment