విద్యుత్ రంగంపై ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం
మేము యూనిట్‌ను కేవలం రూ.3.90కు కొంటున్నాం
బీఆర్‌ఎస్ హయాంలో రూ.20కి కూడా కొన్నారు
దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాల్లోకి వెళ్లిందని దుయ్యబట్టారు. 2014 జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కంల నష్టాలు రూ.12,186 కోట్లు కాగా బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన పూర్తయ్యేసరికి ఆ నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరిందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్య లపై ఆ శాఖ మంత్రిగా తాను చర్చకు సిద్ధమని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తూ కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తు న్నామని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీర్ఘకాలిక అవసరాల కోసమే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు చేశామనే కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.
తాము రూ.13 పెట్టి విద్యుత్ కొనుగోలు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, యూనిట్‌ను కేవలం రూ.3.90కు కొంటున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయంలో రూ.20లకు కూడా విద్యుత్ కొన్నట్టు రికార్డుల్లో నమోదైందని తెలిపారు. ఎన్టీపీసీ నుంచి తాము ఒక యూనిట్‌ను రూ. 5.60లకు కొనుగోలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
కేసీఆర్ హయంలో థర్మల్ విద్యుత్ కొత్త కేంద్రం భద్రాద్రి నుంచి 1080 మెగావాట్లు మాత్రమే వచ్చిందని, ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకున్న 1000 మెగావాట్లను కలిపితే 2080 మెగావాట్లని వివరించారు. 2022లోనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఆగిపోయిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాతే అత్యధిక విద్యుత్ సరఫరా చేశామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే
2012లో గ్రిడ్ కుప్పకూలిన తరువాత హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని భట్టి స్పష్టం చేశారు. ’’దేశంలోని 20 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో ఇలాంటి పవర్ ఐలాండ్ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చాం’అని వివరించారు.
ఫిబ్రవరి నాటికి యాదాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి
యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు రావడానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
4000 మెగావాట్ల ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం చూపి కేవలం రెండు నెలల వ్యవధిలోనే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకువచ్చామని భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment