ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధాని మోదీ మౌనం వీడాలి | Bhatti Vikramarka Fire On Pegasus Spyware Phone Taping | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధాని మోదీ మౌనం వీడాలి

Published Tue, Jul 20 2021 3:42 PM | Last Updated on Tue, Jul 20 2021 3:50 PM

Bhatti Vikramarka Fire On Pegasus Spyware Phone Taping - Sakshi

హైదరాబాద్‌: దేశంలో భావస్వేచ్ఛ లేకుండా పోతోందని కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. పెగాసెస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని గుర్తుచేశారు. అలాంటిది రాహుల్‌గాంధీ ఫోన్‌ కూడా ట్యాప్‌ చేశారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాప్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ, అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపైనా పెద్ద ఎత్తు దాడి జరుగుతోందని తెలిపారు. దేశంలో భావ స్వేచ్ఛ, ప్రైవసీ లేకుండాపోతోందని చెప్పారు.

పెగాసెస్‌ ఫోన్‌ ట్యాప్‌ అంశంపై భట్టి స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక సేవకుల ఫోన్లను బీజేపీ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తుండడంతో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని మండిపడ్డారు. వ్యక్తుల భద్రతా సమస్యకు ఫోన్ కాల్స్ ట్యాప్ తెరలేపాయని పేర్కొన్నారు. పెగాసెస్ అనే స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ని ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని తయారీ సంస్థ ఎన్.ఎస్.ఓ చెబుతోందని గుర్తుచేశారు. దీనిని ప్రయివేటు వ్యక్తులకు అమ్మలేదు.. ఇవ్వలేదని కూడా చెబుతోందని తెలిపారు. పెగాసెస్ స్పైవేర్‌తో చాలామంది నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు 2019 సాధారణ లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచి ట్యాప్ అయినట్లు సిటిజన్స్ ల్యాబ్ మంత్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ టొరొంటో డీటైల్డ్ రిపోర్ట్ ఇచ్చిందని వెల్లడించారు.

ఆ నివేదికలో దేశానికి చెందిన చాలామంది నాయకులు ఫోన్ ట్యాప్ అయినట్లు తేల్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేయడంతో పాటు, ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారని వివరించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా ఆందోళనకరం.. ఇది భద్రతా సమస్యకు తెరలేపిందని చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా గుర్తించిన ప్రతిపక్ష పార్టీల మనుగడకు సంబంధించి, వాటి భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగితే.. అది ప్రజాస్వామ్య మూల సిద్దాంతాలకు ప్రమాదమేనని పేర్కొన్నారు. పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రధాని మోదీ మౌనం వీడి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు. మీడియా సంస్థలపైన కూడా పెగాసెస్ నిఘా పనిచేస్తోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్లతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘానికి సంబంధించిన వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కూడా చెప్పారు. ట్యాపింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌గాంధీ ఫోన్ ట్యాపింగ్‌ను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన ఇందిరాపార్క్‌ నుంచి చలో రాజ్ భవన్ చేపడుతున్నట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement