వేంపల్లె/వైరా/జడ్చర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్న తమ వ్యక్తి గత సిబ్బంది, నాయకులు అందరూ దివంగత వైఎస్ ఆశీస్సులు తీసుకోవాలని భావించి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ హయాంలో తాను శాసన సభ్యుడిగా, అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా పనిచేసినట్లు తెలిపారు.
వైఎస్‌ఆర్‌కు తాను చాలా సన్నిహితంగా ఉండేవాడినన్నారు. ఆయ న ఆశయాలను గౌరవించే అందరూ కూడా సమాజ సేవచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, ఏఐసీసీ సభ్యుడు ధ్రువకుమార్‌రెడ్డి, ఇతర నేతలు నజీర్ అహ్మద్, ప్రభాకర్‌లు పాల్గొన్నారు.
కార్పొరేట్ సంస్థల చేతుల్లో దేశ సంపద
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థల చేతులకు అప్పగించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా ముగియడంతో తనతో పాటు యాత్రలో పాల్గొన్న నాయకులతో కలసి తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకునేందుకు వెళుతూ.. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శివారులోని ఓ హోటల్ వద్ద ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు.
దేశంలో సాగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని భట్టి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తాము పేదలకు ఇచ్చిన భూములను సీఎం కేసీఆర్ గుంజుకుని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకున్నారని విమర్శించారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 74 నుంచి 75 సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చి వేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అనుసరిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment