చంఢీఘఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)కి పెద్ద షాక్ తగిలింది. 10 మంది ఎమ్మెల్యేలలో నలుగురు జేజేపీని వీడారు. ఎమ్మెల్యేలు ఈశ్వర్ సింగ్, రామ్‌కరణ్ కాలా, దేవేంద్ర బబ్లీ శినివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే నిన్న (శుక్రవారం) ఎమ్మెల్యే అనూప్ ధనక్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు.. లోక్ సభ ఎన్నికల్లో చెరో ఐదు సీట్లు గెలుపొందిన బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చర్చ జరుగుతోంది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రామ్‌నివాస్ సుర్జాఖేరా, జోగి రామ్ సిహాగ్‌లపై మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా అనర్హత వేటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. నార్నౌండ్‌కు చెందిన మరో ఎమ్మెల్యే రాంకుమార్ గౌరమ్మ కొంతకాలంగా నుంచి పార్టీని వ్యతిరేకిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. దీంతో దుష్యంత్ చౌతాలా, అతని తల్లి నైనా చౌతాలా, అమర్‌జిత్ ధండాలతో జేజేపీ పార్టీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన హిసార్‌లోని ఉక్లానా ఎమ్మెల్యే అనూప్ ధనక్.. బీజేపీ చేరుతారని, ఫతేహాబాద్‌లోని తోహానాకు ప్రాతినిధ్యం వహించే దేవేంద్ర బబ్లీ, కైతాల్ జిల్లాలోని గుహ్లా చిక్కా ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్, కురుక్షేత్రలోని షహబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్‌కరణ్ కాలా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక.. 90 సీట్లు ఉన్న హర్యానాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరగున్నట్లు ఎన్నికల సంఘం నిన్న (శుక్రవారం) ప్రకటించింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment