పట్నా: బిహార్ యువ రాజకీయనేత చిరాగ్ పాశ్వాన్‌కు గట్టిఎదురుదెబ్బ తగిలింది. లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించారు. కాగా చిరాగ్ పాశ్వాన్ బాబాయ్, ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు... లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేశారు. దీంతో, పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ క్రమంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన పరాస్ బృందం, పార్టీ పదవి నుంచి చిరాగ్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా పరాస్, ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌గా, జాతీయాధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేసింది. అదే విధంగా, ఎల్‌జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సూరజ్‌భాన్ సింగ్ ఉంటారని పేర్కొంది. ఈ క్రమంలో రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అధికార మార్పిడి జరిగి పశుపతి కుమార్ పరాస్ చేతికి పార్టీ పగ్గాలు వస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక తనను తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే చిరాగ్, పార్టీ సభ్యులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తానని తెలిపారు.
చదవండి: ‘ఎల్జేపీ’లో తిరుగుబాటు
Comments
Please login to add a commentAdd a comment