పట్నా: బిహార్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్‌లో పరస్పర విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్‌తో దోస్తీనే తమను దెబ్బ తీసిందని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ అన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా మనసుపెట్టి పని చేయలేదని వ్యాఖ్యానించారు. తమ కూటమికి కాంగ్రెస్ ఒక అడ్డంకుగా మారిందని విమర్శించారు. 70 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి కనీసం 70 బహిరంగ సభలను కూడా కాంగ్రెస్ నిర్వహించలేకపోయిందని అన్నారు. రాహుల్ గాంధీ మూడు రోజులు మాత్రమే ర్యాలీల్లో పాల్గొన్నారని, ప్రియాంక గాంధీ అసలు రానేలేదని వాపోయారు. బిహార్‌తో పెద్దగా పరిచయం లేదని ఇలా చేయడం తగదని అన్నారు.
తమ దగ్గరే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉందని తివారీ అన్నారు. ఎక్కువ స్థానాల్లో పోటీచేసి తక్కువగా సీట్లను సాధించడంపట్ల ఆ పార్టీ దృష్టి సారించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక ఇంటికి పిక్‌నిక్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పార్టీని నడిపే విధానం ఇదేనా అని రాహుల్‌ని తివారం సూటిగా ప్రశ్నించారు. మరోవైపు కూటమిలో సీట్ల పంపకం చాలా ఆలస్యం కావడంతోనే ప్రచారం సరిగా సాగలేదని, ఓటమికి అదే కారణమని కాంగ్రెస్ వాదిస్తోంది. కాగా, 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరగ్గా.. ఎన్‌డీఏ కూటమి 124 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఎన్డీఏ కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల కూటమి మహాగఠ్ బంధన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 111 సీట్లలో విజయం సాధించింది. మహాగఠ్ బంధన్ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని కూటమి సభ్యులు విమర్శిస్తున్నారు. 70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లలో మాత్రమే గెలుపొందడం దీనికి కారణం. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 27 సీట్లలో గెలుపొందింది. ఇక 76 స్థానాల్లో గెలుపొందిన ఆర్జేడీ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో మూడు సీట్లలోనే విజయం సాధించిన లెఫ్ట్ పార్టీలు తాజాగా 16 స్థానాల్లో గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment