
దొండపాడులో లోకేశ్‌ను అడ్డుకున్న స్థానికులు
తాడికొండ: అమరావతి రాజధాని పరిధిలోని గ్రామమైన దొండపాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మహిళలను తీసుకెళుతున్న ట్రాక్టరు ఢీకొనడంతో ఆదివారం ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మృతురాలి కుటుంబీకులను పరామర్శించేందుకు లోకేశ్ వెళ్లగా స్థానికులు ‘గో బ్యాక్ లోకేశ్’ అంటూ నినాదాలు చేశారు.
రాజధాని పరిరక్షణ సమితి పేరిట కొనసాగుతున్న అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేశ్ తాడేపల్లి మండలం ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం వెంకటపాలెం, తుళ్లూరు, దొండపాడు, అనంతవరం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడారు. ఒకరు రైతు టీషర్టు వేసుకుంటాడా అని, మరొకరు రైతు టర్కీ టవల్ వేసుకుంటాడా అంటాడని, రైతు ఫ్‌లైట్‌లో ఢిల్లీ వెళతాడా అని వైఎస్సార్‌సీపీ నేతలు దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. ఆయన వెంట ఎంపీ గల్లా జయదేవ్, గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు టి.శ్రావణ్ కుమార్, సినీనటి దివ్యవాణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment