బీజేపీకి మిత్రపక్షం షాక్‌.. ఎన్డీయే నుంచి ఔట్‌ | BJP Ally Rashtriya Loktantrik Party Quits NDA Over Farm Laws | Sakshi
Sakshi News home page

బీజేపీకి మిత్రపక్షం షాక్‌.. ఎన్డీయే నుంచి ఔట్‌

Published Sat, Dec 26 2020 6:40 PM | Last Updated on Sat, Dec 26 2020 7:08 PM

BJP Ally Rashtriya Loktantrik Party Quits NDA Over Farm Laws - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే దాదాపు నెలరోజులుగా దేశ రాజధానిలో ఆందోళన చేపడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా రూపొందించిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్స్‌కు కేంద్రం దిగొచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. అంతేకాకుండా చట్టాలను వెనక్కి తీసుకునే వరకు దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. (దేశంలో ప్రజాస్వామ్యం లేదు)

రైతుల దీక్షకు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు నూతన వ్యవసాయ బిల్లులు ఎన్డీయేలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్‌ ఇదివరకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. పంజాబ్‌ రైతాంగానికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా సైతం సమర్పించారు. బిల్లులపై పార్లమెంట్‌లో చర్చసాగుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైతులు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరోసారి రైతుల నిరసన దేశ రాజధానికి తగలడంతో మరో భాగస్వామ్యపక్షం ఎన్డీయే నుంచి వైదొలింది. (కేంద్రానికి రైతుల హెచ్చరిక)

రైతుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, దానికి నిరసనగా ఎన్డీయే కూటమి నుంచి వైదులుగుతున్నట్లు రాజస్తాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) అధ్యక్షుడు హనుమాన్‌ బేనివాల్‌ ప్రకటించారు. తక్షణమే రైతుల దీక్షలకు మద్దతు తెలుపుతుమన్నామని శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమన్నారు. రైతుల డిమాండ్స్‌కు వెంటనే స్పందించి కేంద్ర ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్‌ చేశారు. కాగా రాజస్తాన్‌లో బలమైన సామాజికవర్గం మద్దతుదారులను కలిగి ఉన్న ఆర్‌ఎల్‌పీ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 పార్లమెంట్‌ స్థానాల్లో ప్రభాల్యం కలిగిన బేనివాల్‌.. తాజాగా రైతు దీక్షకు మద్దతు ప్రకటించారు. రైతుల డిమాండ్స్‌పై చర్చించాలంటూ గతంలో కేం‍ద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ సైతం రాశారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా ఎన్డీయే కూటమి నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement